ఇగ ఊకోను.. బైలెళ్త.. ఎవనెవని లెక్కేందో తీస్తా: కేసీఆర్

ఇగ ఊకోను.. బైలెళ్త.. ఎవనెవని లెక్కేందో తీస్తా: కేసీఆర్
  • వనెవని లెక్కేందో తీస్త.. ఏడాదిన్నరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది
  • బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో కేసీఆర్​ వ్యాఖ్యలు
  • ఓట్లేయించుకొని దగా చేసిన్రు​.. ఆశపడి జనం బోల్తా పడ్డరు
  • జుట్లు పట్టుకోనీకే ఫ్రీ బస్సు.. రూ.2లక్షల రుణమాఫీ ఏమైంది?​
  • బిల్లులియ్యక మాజీ సర్పంచ్​ల గోస పుచ్చుకుంటున్నరు
  • తెలంగాణకు విలన్​ నంబర్​ 1 కాంగ్రెస్ పార్టీ
  • రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధైతున్నది.. దు:ఖం ఆగుతలే
  • మేం కడుపు కట్టుకొని రాష్ట్ర ఆదాయం పెంచినం.. కాళేశ్వరం కట్టినం
  • పోలీసులూ  రాసిపెట్టుకోండి.. వంద శాతం మళ్లా మేమే వస్తం
  • మా సోషల్​ మీడియా వారియర్స్​పై కేసులు పెడ్తే సహించం
  • కాంగ్రెసోళ్లకు రాజ్యం నడుపుడు చాతనైతలే.. సర్కార్​ను మేం పడగొట్టం
  • ఆపరేషన్​ కగార్​ను ఆపాలని కేంద్రానికి డిమాండ్​

వరంగల్‍ / హనుమకొండ, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైమిచ్చానని.. ఇక ఊరుకోనని, ప్రజల కోసం బయలుదేరుతానని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ అన్నారు. ‘‘కాంగ్రెస్‍ పాలనలో రాష్ట్రం ఏడాదిన్నరకే ఆగమైంది. మంచిగున్న తెలంగాణ నేను పక్కకుపోంగనే బొందలవడ్డట్లయింది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర ఆర్థిక  పరిస్థితిని నాశనం చేశారని, బ్రహ్మాండమైన తెలంగాణను ఆగం చేశారని, ఓట్లేయించుకొని దగా చేశారని మండిపడ్డారు. ఆశపడి జనం బోల్తా పడ్డారని, రాష్ట్రాన్ని చూస్తుంటే తనకు దుఃఖం ఆగుతలేదని అన్నారు. ఆదివారం హనుమకొండ  జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో కేసీఆర్​ మాట్లాడారు. 

కాంగ్రెసోళ్లకు రాజ్యం నడుపుడు చాతనైతలేదని విమర్శించారు. ‘‘తెలివితక్కువ పనితోని పరిపాలన చేయరాక.. సర్వనాశనం చేశారు. మేం కష్టపడి కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని సంవత్సరానికి 10 వేల కోట్ల ఆదాయం పెంచినం. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగులు పెట్టుకొని తెలంగాణను బ్రహ్మాండంగా చేసుకున్నం” అని తెలిపారు.

‘‘నా మనసు బాధ అయితంది.. నా మనసు కాలుతుంది. ఇబ్బంది అయితుంది. నా కండ్ల ముందట్నే తెలంగాణ ఇట్లవ్వడం నాకు దు:ఖం కలిగిస్తున్నది. నేను ఆవేదనతో చెబుతున్న మాటలివి” అని కేసీఆర్​అన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని తాము మొదటి స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానంలోకి పడేశారని, 2014 కంటే ముందటి పరిస్థితులొస్తున్నాయని తెలిపారు. తమ హయాంలో ఎన్నో ఇరిగేషన్​ ప్రాజెక్టులు కట్టామని, మిషన్​ భగీరథతో ఇంటింటికీ కృష్ణా, గోదావరి జలాలు ఇచ్చామని చెప్పారు. 

మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి, పంజాబ్‍ రాష్ట్రాన్ని తలదన్నేలా రాష్ట్రంలో పంటలు పండేలా చేశామన్నారు. ఎవరూ అడగకున్నా కేసీఆర్‍ కిట్‍, రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కంటి వెలుగు వంటి పథకాలు తెచ్చామని చెప్పారు. గొర్లు, బర్లు ఇచ్చామని.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. కానీ, కాంగ్రెస్‍ ప్రభుత్వం మాత్రం అన్నివిధాలా ఫెయిల్‍ అయ్యిందని కేసీఆర్​ దుయ్యబట్టారు. 

‘‘సంక్షేమంలో ఫెయిల్‍.. మంచినీళ్లు ఇచ్చుట్ల ఫెయిల్‍.. పొలాలకు సాగు నీరు ఇచ్చుట్ల  ఫెయిల్‍.. కరెంట్‍ సరఫరాలో, రైతుబంధులో, విత్తనాల పంపిణీలో, ధాన్యం కొనుగోళ్లలో, పల్లెలు,పట్టణాల అభివృద్ధిలో, భూములకు ధరలు పెంచడంలో ఫెయిల్‍. ఇట్ల అన్నిట్ల ఏడాదిన్నరలోనే ఈ సర్కార్​ ఫెయిలైంది​” అని వ్యాఖ్యానించారు. ‘‘ఎటుపడితే అటు ఒర్రుడు.. దేవుళ్లపై ఒట్లు పెట్టుడు.. అబద్ధపు వాగ్దానాలు చేసుడు.. 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకునుడు.. సంచులు నింపుడు.. సంచులు మోసుడులో మాత్రం కాంగ్రెసోళ్లు సక్సెస్‍ అయిన్రు” అని ఆరోపించారు.

 ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు తాము పట్టాలిస్తే.. కాంగ్రెస్‍ సర్కారు మాత్రం హైడ్రా, ఓ బొంద అని పెట్టి పేదలను ఆగంజేసిందని దుయ్యబట్టారు. ‘‘అత్యవసరం ఉంటే ప్రజల అవసరాల కోసం భూములమ్మొచ్చు. కానీ, ఏది అమ్మాల్నో.. ఏది అమ్మొద్దో విచక్షణ ఉండాలె. వీళ్లు  హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీని అమ్ముతున్నరు. రేపు ఉస్మానియా యూనివర్సిటీని అమ్ముతరేమో” అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి నంబర్‍ వన్‍ విలన్‍.. కాంగ్రెస్‍ పార్టీ   

ఆనాడైనా ఇనాడైనా తెలంగాణకు నంబర్‍ వన్‍ విలన్‍ కాంగ్రెస్‍ పార్టీ అని కేసీఆర్‍  ఆరోపించారు. ‘‘నాడు బలవంతంగా ఆంధ్రప్రదేశ్‍లో తెలంగాణను కలిపింది కాంగ్రెస్‍ పార్టీనే. పదవుల కోసం నాడు కాంగ్రెసోళ్లు రాష్ట్రాన్ని ఆగం చేసిన్రు. చంద్రబాబు నాయుడు తెలంగాణ అనొద్దని స్పీకర్‍పై ఒత్తిడి తెచ్చిండు. గోదావరి, కృష్టా నది నీళ్లు తరలిపోతే కాంగ్రెస్‍, టీడీపీ ప్రజాప్రతినిధులు కొట్లాడలేదు.

 2001 నుంచి మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెగించి కొట్లాడితే వాళ్లు ఏడిపించిన్రు. పదవులు వారి ముఖానకొట్టి ఉద్యమానికి, ఆమరణ దీక్షకు దిగితే.. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‍ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసింది. మళ్లీ వెనక్కు తీసుకుని మోసం చేసింది. చివరికి రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‍ పార్టీ తెలంగాణ ఇచ్చింది” అని ఆయన అన్నారు.  

కగార్‍ ఆపరేషన్​ను ఆపాలి

11 ఏండ్ల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణకు ఏమిచ్చిందని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘బీజేపీ తీరు బబ్రజమానం భజగోవిందం. తెలంగాణ ఏమీ ఇయ్యలే. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిన్రని తెలంగాణ గురించి మోదీ అంటడు” అని దుయ్యబట్టారు. కగార్‍ ఆపరేషన్‍ పేరుతో చత్తీస్‍గఢ్‍లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నారని, ఇది ధర్మం కాదని ఆయన అన్నారు. 

‘‘నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదనలు పెడుతుంటే.. బలమున్నది కదా అని సంపుకుంటపోతే ప్రజాస్వామ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్‍  ఆపరేషన్​ను ఆపాలి. మావోయిస్టులను పిలిచి చర్చలు జరపాలి. వారు ఏంమాట్లాడతారో చూడాలి తప్పితే.. ఏరిపడేత్తం. కోసిపడేత్తం.. నరికిపడేత్తం అంటే ప్రజాస్వామ్యం అనిపించుకోదు” అని తెలిపారు. దీనిపై అందరం చప్పట్లతో తీర్మానంగా కేంద్రానికి పంపిస్తామని ఆయన అన్నారు.  

రుణమాఫీ ఏమైంది..? జుట్లు పట్టుకోనీకే ఫ్రీ బస్సు

కాంగ్రెస్‍ పార్టీ ఎన్నికల సమయంలో రూ.15 వేల రైతుబంధు, రూ.4 వేల పింఛన్​, ఇంట్లో ఇద్దరికి పింఛన్, ఆడపిల్లలకు స్కూటీలు వంటి ఎన్నో హామీలు ఇచ్చిందని, అవి ఏమయ్యాయని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. ఒక్క కలం పోటుతో అయిపోతదన్నరు. ఏమైంది? కాంగ్రెసోళ్ల నోటికి మొక్కాలి. 420 హామీలు ఇచ్చిన్రు” అని దుయ్యబట్టారు. వీళ్లు మహిళలకు ఉచిత బస్సు పథకం పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నరని వ్యాఖ్యానించారు. 

‘‘అదో దరిద్రం స్కీమ్​ అని మహిళలే అంటున్నరు. అది ఎందుకు పనికిరావట్లే” అని అన్నారు. ‘‘ఓట్లప్పుడు తమకు అపారమైన అనుభవమున్నదని, సిపాయిలమని చెప్పిన కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు వాళ్లను ఎవరూ నమ్ముతలేరని అంటున్నరు. అప్పు పుడుతలేదంటున్నరు. ఎలక్షన్లప్పుడు  ప్రజలను దగా చేసి ఓట్లెయించుకున్నరు. ఏడాదిన్నరలో అన్నిట్ల ఫెయిలైన్రు. మనమంతా(జనం) ఆశపడ్డం కదా.. నమ్మి బోల్తా పడ్డం కదా.. గల్లంతైనం కదా?” అని పేర్కొన్నారు. 

మాట్లాడితే తమ పార్టీని కాంగ్రెసోళ్లు బద్నాం చేస్తున్నారని.. రాష్ట్రాన్ని దివాలా తీయించి, అడ్డంపొడుగు మాట్లాడుతున్నరని దుయ్యబట్టారు. మాజీ సర్పంచ్​లకు,  కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లిస్తలేరని అన్నారు. ‘‘పాపం మాజీ సర్పంచ్​లు. పనిచేసినం.. బిల్లులు ఇయ్యున్రి అంటే.. వాళ్లను ఈ సర్కార్​ గోస పుచ్చుకుంటున్నది” అని కేసీఆర్​ మండిపడ్డారు. 

పోలీసుల్లారా.. డైరీలో రాసిపెట్టుకోండి

ఎల్కతుర్తిలో తాము సభ పెట్టుకుంటే పోలీసోళ్లు, ఆర్‍టీఏ వాళ్లు అడ్డుకునేందుకు కుట్రలు చేశారని కేసీఆర్​ ఆరోపించారు. ‘‘బీఆర్​ఎస్​ సభలను ఆపుతరా..? ఈ ప్రభంజనాన్ని ఎవడాప్తడు..?” అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కులేదా అని అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంది. బీఆర్‍ఎస్‍ పార్టీ సోషల్‍ మీడియా వారియర్స్​ బ్రహ్మాండంగా పనిచేస్తున్నరు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పోలీసులు కేసులు పెడ్తున్నరు. 

ఇదేం పద్ధతి?” అని ప్రశ్నించారు. ‘‘పోలీసులారా.. మీరెందుకు దుముకులాడుతున్నరు. మీకేం అక్కరకొచ్చింది. వెళ్లి మీ డైరీల్లో రాసిపెట్టుకోండి.. వందకు వంద శాతం మళ్లీ వచ్చేది  బీఆర్‍ఎస్‍ ప్రభుత్వమే. మీరు చదువుకోలేదా.. మీకు విజ్ఞానం లేదా.. మీరేందుకు కేసులు పెడ్తున్నరు. మీరెందుకు రాజకీయాలు చేస్తున్నరు” అని వ్యాఖ్యానించారు. తమ వాళ్లపై ఎక్కడా ఎవరూ కేసులు పెట్టినా.. కేసీఆర్‍, బీఆర్‍ఎస్‍ లీగల్‍ సెల్‍ అండగా ఉంటుందన్నారు. ‘‘ఈడికెళ్లి నేను ఊరుకోను. ఏడిదాకైనా మంచిదే. ఎవనెవని సంగతీ, లెక్కందో తీస్త” అంటూ కేసీఆర్​ హెచ్చరించారు.  

గవర్నమెంట్‍ను పడగొట్టం    

రాష్ట్రంలో తాము కాంగ్రెస్‍ ప్రభుత్వాన్ని కూల్చగొట్టబోమని కేసీఆర్‍  తెలిపారు. ‘‘మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‍తో ఎవరో కొందరు ‘ఇంకా మూడేండ్లు ఈ గవర్నమెంట్‍ను భరించాల్నా’ అని అన్నరట. ఆయన అదే మాటను విలేకరులకు చెప్పిండు. దీనికి మేమేదో ఈ గవర్నమెంట్‍ను పడకొడుతున్నట్లు మాట్లాడుతున్నరు. 

మేమేందుకు పడకొడ్తం భయ్​. మా కాళ్లుచేతులు ఏమైనా గులగులబెట్టినయా? మేమా కిరికిరి పనిచేయం. బిడ్డా.. మీరే ఉండాలే.  ఓట్లు తీసుకున్నరు.. సక్కగా పనిచేయకుంటే ప్రజలే మీ వీపులు సాఫుజేస్తరు. మేం మీ గవర్నమెంట్​ను పడగొట్టం. మీ సంగతేందో మా సంగతేందో ప్రజలకు తెలియాలె” అని ఆయన అన్నారు.   

నేను అసెంబ్లీకి రావాల్నట..!

అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్​ప్రశ్నించారు. ‘‘కేసీఆర్​నువ్వు రా అసెంబ్లీకి అంటరు. దేనికి..? 
నీ కాయగొరుకుడు ముచ్చట్లు ఇనటానికా..? అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే. కమీషన్లు తీసుకుంటున్నరని మా కేటీఆర్​నిలదీస్తే.. ఆర్థిక మంత్రి భుజాలు తడుముకుంటున్నడు. ఎందుకా బాధ?’’ అని అన్నారు. కాంగ్రెస్‍ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో ఏమీ చేయలేదని, ఇంకో రెండున్నరేండ్లు ఏం చేస్తుందని నిలదీశారు. 

‘‘ప్రజలు, మేధావులు ఆలోచన చేయాలె. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? ముందటికి పోతదనుకుంటే ఏమైంది? ముల్లును ముల్లుతో తీసినట్లు పోయినకాడనే ఎతకాలె. మళ్లా బీఆర్​ఎస్​ ప్రభుత్వమే వస్తది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. తన​ పేరు చెరిపేయాలని ఈ సర్కార్​ చూస్తున్నదని.. అది జరిగే పని కాదని కేసీఆర్​ అన్నారు.