న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఢిల్లీలోని మురికివాడలను కూల్చేస్తోందని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ మురికివాడలు నిర్మిస్తానని చెప్పి.. విలాసవంతమైన శీష్ మహాల్ నిర్మించుకున్నాడని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కేజ్రీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం (జనవరి 12) షకుర్ బస్తీలోని మురికివాడలను కేజ్రీవాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి మురికివాడలంటే ప్రేమ లేదు.. అది సంపన్నుల పార్టీ.. వాళ్లకు మురికివాడల వాళ్లతో సంబంధం ఏంటి..? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మురికివాడల ప్రజలను కీటకాలుగా పరిగణిస్తారని ఆరోపించారు.
ALSO READ | నిరుద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేలు
ఎన్నికల ముందు మాత్రమే మురికివాడల సమస్యల గురించి వాళ్లు మాట్లాడుతారని.. ఆ తర్వాత వారు మురికివాడల భూములు లాక్కుంటారని నిప్పులు చెరిగారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మురికివాడలను విస్మరించి, ఓట్ల కోసం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వారిపై కపట ప్రేమ చూపిస్తోందని ఫైర్ అయ్యారు. ''మీకు సవాల్ చేస్తున్నా.. మురికివాడల ప్రజలపై మీరు పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోండి. ఏ భూమి నుండి వాళ్లను వెళ్లగొట్టారో అదే భూమిలో వారందరికీ ఇళ్లు ఇస్తామని కోర్టులో అఫిడవిట్ సమర్పించండి. బీజేపీ ఈ పని చేస్తే వచ్చే నేను ఎన్నికల్లో పోటీ చేయను’’ అని బీజేపీ కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు.
ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో లిస్ట్
గత ఐదేళ్లలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మురికివాడల నివాసుల కోసం కేవలం 4,700 ఫ్లాట్‌లను మాత్రమే నిర్మించిందని.. ఆ పార్టీ తీరుతో నగరంలోని 4 లక్షల మురికివాడల కుటుంబాలు అల్లాడిపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఈ వేగంతో మురికివాడల్లో నివసించే వారందరికీ గృహాలను అందించడానికి 1,000 సంవత్సరాలు పడుతుందని సెటైర్ వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికలు ముగిసిన వెంటనే మురికివాడలను కూల్చివేయడానికి మార్గం సుగమం చేశారని ఆరోపించారు. మురికివాడల ఆక్రమిత భూములను రైల్వే శాఖ ఇప్పటికే టెండర్లు వేసిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చేస్తోందని ఆరోపించారు.