ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీని గెలవనివ్వం: కేజ్రీవాల్

 ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీని గెలవనివ్వం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉండగానే ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెంచుకుతున్నారు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ఓ వైపు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూనే.. మరోవైపు ప్రత్యర్థులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఆకట్టుకునే పథకాలు ప్రకటిస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం (డిసెంబర్ 29) ఢిల్లీలో ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్ ఓటర్ల జాబితా వివాదంపై బీజేపీని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే దేశ రాజధానిలో ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభించిందని.. డిసెంబర్ 15వ తేదీ నుండి కమలం పార్టీ ఈ ఆపరేషన్ ప్రారంభించిందని ఆరోపించారు కేజ్రీ. ‘నేను పోటీ చేయనున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో డిసెంబర్ 15 నుంచి బీజేపీ ఆపరేషన్ కమలం కొనసాగుతోంది. ఈ 15 రోజుల్లో వారు 5,000 ఓట్లను తొలగించడానికి, 7,500 ఓట్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు’ అని పేర్కొన్నారు. 

అసెంబ్లీలోని మొత్తం ఓటర్లలో సుమారు 12 శాతం మంది ఓటర్లను తారుమారు చేస్తుంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని బీజేపీని ప్రశ్నించారు కేజ్రీవాల్. తప్పుడు పద్దతుల్లో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ కోరుకుంటోందని.. కానీ ఢిల్లీ ప్రజలు దాన్ని జరగనివ్వరని అన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించిన వ్యూహాలను ఇక్కడ పని చేయవని.. ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలనివ్వబోమని హాట్ కామెంట్స్ చేశారు.