ఎమ్మెల్యే పదవులకు కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై రాజీనామా

ఎమ్మెల్యే పదవులకు కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై రాజీనామా

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికైన జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన  రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్‌కి ఆయన కార్యాలయంలో సమర్పించారు. ఆయనతోపాటు బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై  కూడా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  

రెండు స్థానాల్లో కొనసాగే అవకాశం లేకపోవడంతో..  వీరు, ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు.  కాగా, కుమారస్వామి చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, బొమ్మై.. షిగ్గావ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా పార్లమెంట్ నియోజకవర్గం నుండి కుమారస్వామి పోటీ చేసి గెలిచారు.  ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఇటీవల కుమారస్వామి ప్రమాణం చేశారు. బొమ్మై హవేరి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఈ రెండు అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం.. ఈ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలను ప్రకటించాల్సి ఉంది.