- బీజేపీకి ఎలక్షన్ కమిషన్ వంతపాడింది: రాహుల్ గాంధీ
- మోదీ అంటే ద్వేషం లేదు..
- ఆయన అభిప్రాయాలనే వ్యతిరేకిస్త
- అమెరికాలో కాంగ్రెస్ నేత కామెంట్లు
- కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని గుర్తుచేసిన ఎంపీ
- అయినా మోదీ అజెండా విచ్ఛిన్నం
- జార్జిటౌన్ యూనివర్సిటీలో స్టూడెంట్లతో ఇంటరాక్షన్
వాషింగ్టన్ డీసీ: ఇండియాలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్ ను పూర్తిగా నియంత్రించారని కాంగ్రెస్ మాజీ చీఫ్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుకూలంగా పని చేసిందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసినా తాము ధైర్యంగా పోరాడి ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను చాలెంజ్ చేశామన్నారు.
మెరికా పర్యటనలో ఉన్న రాహుల్ మంగళవారం వాషింగ్టన్ డీసీలోని జార్జిటౌన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేదన్నారు. ‘‘ఆ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు. లేకపోతే బీజేపీకి 240లోపే సీట్లు వచ్చేవి. వారికి ఆర్థికంగా భారీ అడ్వాంటేజ్ ఉంది. మా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. వాళ్లు ఏం కోరుకుంటే అది ఎన్నికల సంఘం చేసింది.
వివిధ రాష్ట్రాల్లో మోదీ స్ట్రాటజీలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణ జరిగింది. అయినా మోదీ అజెండాను విచ్ఛిన్నం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది” అని రాహుల్ అన్నారు. ‘‘ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే బీజేపీ, ప్రధాని మోదీ అంటే అందరికీ భయం పోయింది. దీంతో రాజ్యాంగంపై దాడిని ప్రజలు అంగీకరించలేదని తేలిపోయింది. ఇది రాహుల్ గాంధీకి కాదు కాంగ్రెస్ పార్టీకి, భారత ప్రజలకు దక్కిన గొప్ప విజయం” అని అన్నారు.
ఎన్ఆర్ఐలు రెండు దేశాలకు వారధులు..
అమెరికాలోని భారతీయులు రెండు గొప్ప దేశాలకు వారధులుగా నిలుస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో భారత సంతతి ప్రజలతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇండియన్ అమెరికన్లకు రెండు దేశాల గుర్తింపులు ఉన్నాయి. వాళ్లు అమెరికా, భారత్ ఐడియాలను వ్యాప్తి చేయగలరు. మీరు ఈ రెండు గొప్ప దేశాలకు వారధులు.
మీరు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇక్కడకు వచ్చారు. అయినా, ఇండియా అన్నా, అమెరికా అన్నా మీకు అంతే గర్వకారణం” అని అక్కడి భారతీయులను రాహుల్ ప్రశంసించారు. ‘‘బీజేపీ సిద్ధాంతం ప్రకారం మీకు రెండు గుర్తింపులు ఉండరాదు. మీరు ఒకే సమయంలో ఇటు ఇండియన్ గా, అటు అమెరికన్‌గా ఉండరాదు. అందుకే మేం ద్వేషాన్ని కాకుండా ప్రేమను వ్యాప్తి చేయాలని చెప్తున్నాం.
Also Read:-వందే భారత్ ట్రైన్ అద్దాలు సుత్తితో బద్ధలు కొట్టడం ఏంటన్నా..!
వర్గాలు, ప్రాంతాలు, మతాలు, భాషలను గౌరవించాలని కోరుతున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు. ఇండియాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అసలు సమస్య అని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఉదాహరణకు ఒక వ్యక్తి భోజనం ముందు కూర్చున్నప్పుడు పప్పు కన్నా అన్నం చాలా ముఖ్యం.
కూరలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అంటే.. ఎలా ఉంటుంది? ఇప్పుఈఈడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా అలాగే చేస్తున్నాయి. భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య. అంటే.. భాషలు, సంప్రదాయాలు, చరిత్రలు, కళల వంటి వాటి సమాహారం అని అర్థం. కానీ కొన్ని రాష్ట్రాలు, వర్గాలు, మతాలు, భాషలు ఇతరుల కంటే తక్కువ అని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది” అని ఆయన ఆరోపించారు.
మోదీ అంటే ద్వేషం లేదు..
ప్రధాని మోదీ అంటే తనకు ద్వేషం లేదని, ఆయనను శత్రువుగా కూడా చూడటం లేదని రాహుల్ గాంధీ అన్నారు. జార్జిటౌన్ యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్షన్ లో ఆయన మాట్లాడుతూ.. మోదీ అభిప్రాయాలు మాత్రమే తనకు నచ్చవని చెప్పారు. చాలా సార్లు మోదీ చేసే పనులను, తీసుకునే నిర్ణయాలను తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆయన అభిప్రాయాలు, తన అభిప్రాయాలు మాత్రం వేరుగా ఉంటాయన్నారు. ఆయన ఆలోచనలు ఉత్పాదకత దిశగా ఉండవని, అందుకే వాటి కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలన్నదే తన ఆలోచన అని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే సిక్కుల్లో భయం: కేంద్ర మంత్రి
జనాభాలో 90% మందికి ప్రాతినిధ్యంలేని దేశంలో తాను ఉండలేనని, భారత్‌లో సిక్కుల కు మతపరమైన స్వేచ్ఛ లేదంటూ మంగళవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత అజయ్ అలోక్ ఫైర్ అయ్యారు. ‘‘90% మంది ప్రజలకు ప్రాతినిధ్యంలేని దేశంలో తాను ఉండలేనని రాహుల్ అన్నారు.
ఆయన మాట్లాడుతున్నది ముస్సోలినీ ఇటలీ గురించా? లేదంటే హిట్లర్ జర్మనీ గురించా? ఇండియాలో ప్రతి కమ్యూనిటి కీ న్యాయంగా ప్రాతినిధ్యం దక్కుతున్నది. రాహుల్ లాంటి ఒక మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు ప్రతిపక్ష నేత కావడమే ఇందుకు అతిపెద్ద నిదర్శనం” అని అజయ్ అలోక్ అన్నారు. అలాగే గురుద్వారాలకు వెళ్లినప్పుడు సిక్కులను తలపాగాలు ధరించనివ్వడం లేదన్న రాహుల్ కామెంట్స్ పై హర్దీప్ సింగ్ మండిపడ్డా రు.
దేశంలో ఎక్కడా సిక్కులకు తలపాగా ధరించే విషయంలో సమస్య లేదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సిక్కులు మతపరమైన దాడులు ఎదుర్కొన్నారంటూ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్ పాలనలోనే ఢిల్లీలో 3 వేల మంది సిక్కులను ఊచకోత కోశారు. తలపాగాలను తీసేశారు. జుట్టు, గడ్డం కత్తిరించారు. ఇవే కామెంట్లను ఇండియాలో చేస్తే ఆయనను కోర్టుకు లాగుతా” అని బీజేపీ నేత ఆర్పీ సింగ్ అన్నారు.