
- ఎగ్జిట్ పోల్స్ పై రాహుల్ కామెంట్
- తమకు 295 సీట్లు వస్తాయని ధీమా
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. మళ్లీ ఎన్డీయే సర్కారే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. ‘‘అవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ మీడియా పోల్స్” అని రాహుల్ కామెంట్ చేశారు.
పార్టీ లోక్ సభ అభ్యర్థులు, లెజిస్లేటివ్ లీడర్లు, పీసీసీ అధ్యక్షులతో ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం ఓట్ల లెక్కింపు రోజు అలర్ట్ గా ఉండాలని పార్టీ క్యాడర్ కు అగ్ర నేతలు సూచించారు. ఫలితాల రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ మీటింగ్ అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మీడియా ప్రశ్నించగా.. ‘‘మీరు సిద్ధూ మూసేవాలా సాంగ్ 295 విన్నారా?” అని బదులిచ్చారు. అంటే ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని చెప్పకనే చెప్పారు.
జైరాం రమేశ్ వివరణ కోరిన ఈసీ..
ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకుగాను బ్యూరోక్రసీని భయపెట్టేందుకు, ప్రతిపక్షాల నైతికతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. కౌంటింగ్కు రెండ్రోజుల ముందు 150 మంది జిల్లా మేజిస్ట్రేట్లు/కలెక్టర్లను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బెదిరించారని శనివారం ఆయన ట్వీట్ చేశారు.
జైరాం ట్వీట్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. దీనిపై సమాచారం ఉంటే తమకు సమర్పించాలని లేఖ రాసింది. ఆదివారం రాత్రి 7 గంటలలోపు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని జైరాంను ఆదేశించింది.