గద్వాల/శాంతినగర్, వెలుగు: ఒకవైపు సుంకేసుల నుంచి కేసీ కెనాల్ కు నీళ్లు వస్తున్నా ఆర్డీఎస్ కు మాత్రం నీళ్లను వదలడం లేదని ఆర్డీఎస్ రైతులతో కలిసి ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం ఆర్డీఎస్ మెయిన్ కెనాల్ లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ రైతులు నీళ్లు రాక గోస పడుతుంటే ఇక్కడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒకరేమో ఉన్న స్థానాన్ని ఎలా కాపాడుకోవాలా అని, మరొకరేమో టికెట్ ఎలా తెచ్చుకోవాలా అని 24 గంటలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటక, ఏపీ ఆఫీసర్లతో మాట్లాడి ఆర్డీఎస్ కెనాల్ కి నీళ్లు తీసుకురావాల్సి ఉండగా చోద్యం చూస్తున్నారన్నారు.
ఇప్పటికే చాలామంది రైతులు మిరప, పత్తి, మొక్కజొన్న పంటలు వేసుకున్నారని, ఆగస్టులో నీళ్లు వదలాల్సి ఉన్నా అవి రాకపోవడంతో అంతా నట్టేట మునిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్డీఎస్ కెనాల్ నీళ్లు ఎలా వస్తాయో తెలియని ఆఫీసర్లు ఉండడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు తుమ్మిళ్ల లిఫ్ట్ పేరుతో ఓట్లు దండుకొని ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని, మల్లమ్మ కుంట, జూలకల్లు రిజర్వాయర్లు నిర్మించకుండా తుమ్మిళ్ల లిఫ్ట్ ను నిర్వీర్యం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ లీడర్లపై తిరగబడి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్డీఎస్ కు నీళ్లు విడుదల చేయించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు.