KL Rahul: రాహుల్ గొప్ప బ్యాటర్.. భయపడాల్సింది లేదు: భారత మాజీ స్పిన్నర్

KL Rahul: రాహుల్ గొప్ప బ్యాటర్.. భయపడాల్సింది లేదు: భారత మాజీ స్పిన్నర్

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‪తో జరిగిన తొలి టెస్టులో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‪లో 6 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవియన్ చేరిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దాంతో, అతన్ని జట్టు నుంచి తప్పించాలని విమర్శలు వస్తున్నాయి. అతని స్థానంలో మరొకరికి చోటివ్వాలని పలువులు మాజీలు సూచిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు.. రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. 

రాహుల్ అనుభవజ్ఞుడైన ఆటగాడన్న వెంకటపతి రాజు.. అతని ఓర్పు, సహనం ఏదో ఒక సమయంలో భారత జట్టుకు ఉపయోగపడతాయని కితాబిచ్చారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చని తెలిపారు. ఒకటి.. రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైనంత మాత్రాన ఓ కీలక బ్యాటర్ ను జట్టు నుంచి తప్పించడం సరికాదని అన్నారు.

నేను కెప్టెన్‌ అయితే..

"మన(భారత జట్టు) ప్లేయింగ్ XIతో మార్పులు చేయాలని నేను అనుకోవడం లేదు. నేను కెప్టెన్‌ అయ్యుంటే.. ఇదే జట్టును కొనసాగిస్తా. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరం. కేవలం ఒక టెస్టులో విఫలమైనంత మాత్రాన రాహుల్‌ను కూర్చోబెట్టమనడం సరికాదు. అతను అనుభవజ్ఞుడైన బ్యాటర్, మంచి ఫీల్డర్. తదుపరి టెస్ట్ ఆడాలి. భయపడాల్సిన అవసరం లేదు.." 

ALSO READ | David Warner: నెల రోజుల్లో భారత్‌తో టెస్ట్ సిరీస్‌.. వార్నర్ సంచలన నిర్ణయం

"వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) స్టాండింగ్స్‌లో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. రోహిత్ సానుకూల కెప్టెన్. అతను సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తాడు. ఏం చేస్తున్నామనేది అతనికి స్పష్టంగా తెలుసు. పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. వాతావరణం మన చేతుల్లో లేదు. 46 ఆలౌట్‌ను వీలైనంత త్వరగా మరిచిపోవాలి. సిరీస్‌ సమం చేసే సమయం. అతను చేస్తాడని నేను ఆశిస్తున్నాను.." అని వెంకటపతి రాజు ఓ జాతీయ ఛానల్ తో అన్నారు.

అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా భారత్- న్యూజిలాండ్‌ రెండో టెస్టు ప్రారంభం కానుంది.