Gautam Gambhir: అధికారిక ప్రకటన.. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్

Gautam Gambhir: అధికారిక ప్రకటన.. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్

టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయ్యింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం(జులై 09) ప్రకటించారు. గంభీర్‌కు ఘన స్వాగతం పలుకుతూ బీసీసీఐ సెక్రటరీ.. సుధీర్ఘ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించగల ఆదర్శవంతమైన లక్షణాలు మాజీ ఓపెనర్‌లో పుష్కలంగా ఉన్నాయంటూ గౌతీపై.. షా పొగడ్తల వర్షం కురిపించాడు. 

గంభీర్‌ 2027 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. అతని సారథ్యంలో భారత జట్టు త్వరలో శ్రీలంకలో పర్యటించనుంది. గంభీర్‌కు గతంలో ఎలాంటి కోచింగ్ అనుభవం లేనప్పటికీ, ఐపీఎల్ టోర్నీలో పలు జట్లకు మెంటార్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది తన శిక్షణలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టును విజేతగా నిలిపాడు.

ALSO READ | Rahul Dravid: టీమిండియాకు గుడ్ బై.. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ద్రవిడ్..?

"భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ కి స్వాగతం పలకుతున్నందుకు  ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పులను, ప్రతి దృశ్యాన్ని గౌతమ్ చాలా దగ్గరగా చూశాడు. తన కెరీర్‌లో వివిధ పాత్రల్లో రాణించి, కష్టాలను తట్టుకొని ఎదురొడ్డి నిలబడ్డాడు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించగల ఆదర్శవంతమైన వ్యక్తి గౌతమ్ అని నాకు నమ్మకం ఉంది. భారత జట్టు పట్ల అతని స్పష్టమైన దృష్టి, అతని విస్తారమైన అనుభవం కోచింగ్ పాత్రను స్వీకరించడానికి పరిపూర్ణం చేశాయి.." అని జై షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాగా, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టును విశ్వ విజేతగా నిలిపిన ద్రవిడ్ సంతోషంగా తన బాధ్యతల నుండి వైదొలిగాడు.