టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. అతను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కంటే గొప్ప ఆటగాడని చెప్పాడు. పాంటింగ్ ఆడినప్పటికి..ఇప్పటికి చాలా తేడా ఉందని..ప్రస్తుతం నిబంధనలు బ్యాటింగ్కు అనుకూలంగా మారాయన్నాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం పాంటింగ్ కంటే మెరుగైన ఆటగాడని తెలిపాడు.
ఉప ఖండంలో పాటింగ్కు చెత్త రికార్డు..
లంకతో రెండో వన్డే మొదలవ్వడానికి ముందు స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో రికీ పాంటింగ్‌తో రోహిత్ శర్మను పోలుస్తూ గంభీర్ చర్చకు తెరలేపాడు. పాంటింగ్ కంటే రోహిత్ శర్మనే గొప్ప ఆటగాడని కొనియాడాడు. పాంటింగ్ సహచర ఆటగాళ్ల అభిప్రాయాలను కూడా బేఖాతరు చేశాడని చెప్పాడు. ఏ విషయంలో చూసుకున్నా పాంటింగ్ కంటే రోహిత్‌కే మెరుగైన రికార్డు ఉందని...ముఖ్యంగా ఉపఖండంలో రికీ పాంటింగ్‌కు చెత్త రికార్డు ఉందన్నాడు.
రోహిత్ శర్మ 20 సెంచరీలు కొడతాడు..
రోహిత్ శర్మకు విదేశాల్లో ఘనమైన రికార్డు ఉందని గంభీర్ అన్నాడు. గత నాలుగైదేళ్లలో అతను ఎక్కువ సెంచరీలు కొట్టాడని..ఇందులో ఎక్కువ చేశాడన్నాడు. రోహిత్ మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడతాడని..ఇలాగే ఆడితే అతను మరో 20 సెంచరీలు ఖచ్చితంగా కొట్టగలడన్నాడు. రోహిత్ శర్మ తన కెరీర్‌లో విదేశాల్లో 13 వన్డే సెంచరీలు సాధించినట్లు గుర్తు చేశాడు. అంతేకాకుండా 2019 వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడని చెప్పుకొచ్చాడు. కానీ పాంటింగ్ తన కెరీర్‌లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో కేవలం 6 సెంచరీలు మాత్రమే సాధించాడని గంభీర్ వివరించాడు.