వారసుడు వస్తున్నాడు.. భారీ షాట్లతో అలరిస్తున్న భారత బౌలర్ తనయుడు

ఒక్క రైతు మినహా డాక్టర్ కొడుకు డాక్టర్.. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్.. రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయం బాట పడుతున్న రోజులివి. ఇటువంటి భారత సమాజంలో ఓ క్రికెటర్ తన కుమారుడిని క్రికెటర్ చేయకుండా ఉంటారా..! అందుకే ఓ భారత క్రికెటర్ తన తనయుడికి క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. ఎందరో దిగ్గజ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన తన బౌలింగ్‌లోనే.. కుమారుడికి బంతిని ఎలా ఎదుర్కోవాలో మెళుకువలు నేర్పుతున్నాడు.

నిఖార్సైన స్వింగ్ బౌలర్

బ్యాట్ చేత పట్టి బంతితో కుస్తీ పడుతున్న ఆ బుడతడు భారత పేసర్ ప్రవీణ్ కుమార్ తనయుడు. పేరు.. అర్వీ.. వయసు ఏడేళ్లు. బహుశా ఈ భారత పేసర్ పేరు తెలియని అభిమాని ఉండకపోవచ్చు. 2000 దశకంలో భారత జట్టులో అత్యుత్తమ పేసర్ ప్రవీణ్ కుమార్. బంతిని ఇరు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులేస్తూ బ్యాటర్లను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టేవాడు. అతడి స్వింగ్ దెబ్బకు బంతి ఎటు పడి  ఎటు వస్తుందో అర్థం కాక దిగ్గజ బ్యాటర్లు తలలు పట్టుకునేవారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్.. ఇలా అగ్రశ్రేణి జట్ల అన్నింటిపై ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కాకపోతే తనయుడు తండ్రికి భిన్నంగా బ్యాట్ చేత పట్టాడు. తండ్రి బంతులేస్తుంటే బ్యాట్‍తో సాధన చేస్తున్నాడు.

పాక్‌పై అరంగ్రేటం

ప్రవీణ్ కుమార్ 2007లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. జైపూర్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల ఖాతాలో తెరవలేకపోయినా.. తరువాత రోజుల్లో తన సత్తా ఏంటో చూపెట్టాడు. టీమిండియా తరఫున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు పడగొట్టాడు.