భారత దిగ్గజ క్రికెటర్ల తనయులు ఒక్కొక్కరిగా తెరమీదకు వస్తున్నారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. అభిమానుల అంచనాలు అందుకోనప్పటికీ.. శక్తికి మించి రాణించాడనే చెప్పాలి. మరోవైపు.. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ ఢిల్లీ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇప్పుడు హైదెరాబాదీ స్టయిలిష్ బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ కొడుకు సర్వజిత్ వంతు వచ్చింది. సికింద్రాబాద్ నవాబ్స్ జట్టు తరుపున ఆడుతున్న సర్వజిత్.. తన రెండో మ్యాచులోనే సెంచరీ చేశాడు. మొదటి మ్యాచులో 14 పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచినా.. రెండో మ్యాచులో శతకం బాది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. 209 బంతులు ఎదుర్కొన్న సర్వజిత్..12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 104 పరుగులు చేశాడు.
కొడుకు సెంచరీ చేయడం పట్ల లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండో మ్యాచులోనే సెంచరీ చేయడం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక తాను సెంచరీ చేయడంపై మాట్లాడిన సర్వజిత్.. ఈ సెంచరీ తన జీవితంలో కలకాలం గుర్తిండిపోతుందని, భవిష్యత్తులో మరింత కష్టపడి పరుగులు సాధిస్తానని వెల్లడించాడు. సర్వజిత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.