బీసీసీఐ అంపైరింగ్ ప్యానెల్‌లో భారత మాజీ క్రికెటర్ నిధి బులే, ఆమె సోదరి రితికా బులే చోటు దక్కించుకున్నారు. బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలో ఇండోర్కు చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెల్లు పాస్ అయి భారత క్రికెట్లోని అంపైర్ల ప్యానెల్లో స్థానం సంపాదించారు. వీరితో పాటు మరో ఇద్దరు మాజీ మహిళా క్రికెటర్లు కూడా ఉత్తీర్ణత సాధించారు. జూన్ 10 నుంచి 13 వరకు రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ అంపైరింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్టులో 150 మార్కులకు 120 కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. ఈ టెస్టులో నిధి 133.5 మార్కులు, రితికా 133 మార్కులు సాధించారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన వి. కృతిక... విదర్భకు చెందిన అంకిత గుహ కూడా బీసీసీఐ అంపైర్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఈ టెస్టులో ముంబై క్రికెట్ అసోసియేషన్ కు చెందిన నిఖిల్ పాటిల్ 147 మార్కులతో అంపైరింగ్ అర్హత పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు.
నిధి బులే టీమిండియా తరపున ఒక టెస్టు, ఒక వన్డే మ్యాచ్ ఆడింది. 2006లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచులో ఆడిన నిధు బులే ఏడు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 12 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చుకుంది. వికెట్లేమి తీయలేకపోయింది. అయితే నిధు బులే చెల్లెలు రితికా బులే టీమిండియాకు ఎంపిక కాలేపోయింది. కానీ మధ్యప్రదేశ్ జట్టు తరపున 31 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడింది.