కాళేశ్వరం మార్పుల వెనుక..ఎవరున్నరు?

  •     ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు?
  •     ఇరిగేషన్​ అధికారులు ప్రతిపాదించారా? లేదా పైనుంచి ఒత్తిళ్లా?
  •     ఉన్నతాధికారులపై జ్యుడీషియల్ ​కమిషన్​ ప్రశ్నల వర్షం
  •     తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లున్నా మేడిగడ్డకు ఎందుకు తరలించారు?
  •     ఫండ్స్ సేకరణ, ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్​ అనుసరించారు?
  •     ఇన్​టైంలో పూర్తయినా అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది?
  •     కమిషన్ ​ముందు మాజీ సీఎస్​సోమేశ్ కుమార్​ హాజరు
  •     ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు,రజత్​కుమార్​, వికాస్​రాజ్,స్మితా సబర్వాల్​ కూడా
  •     ఆన్​లైన్​లో అటెండ్​ అయిన ఎస్కే జోషి

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ కీలక దశకు చేరింది. ఇన్నాళ్లూ ఇరిగేషన్ ఆఫీసర్లు, ఏజెన్సీ ప్రతినిధులను విచారించి టెక్నికల్​ అంశాలను రాబట్టిన కమిషన్​.. ఇప్పుడు సెక్రటరీల స్థాయిలో జరిగిన పాలసీ డెసిషన్లు, ఫైనాన్స్​అంశాలపై ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్​లోని​ బీఆర్​కే భవన్​లో మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​ సహా పలువురు సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్లను కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ ​ఎంక్వైరీ చేసింది.

బీఆర్ఎస్​ సర్కారు హయాంలో ఇరిగేషన్ బాధ్యతలు చూసిన రజత్​కుమార్, వికాస్​ రాజ్, స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణా రావు, మాజీ కార్యదర్శి నాగిరెడ్డి తదితరులు జ్యుడీషియల్​ కమిషన్​ముందు విచారణకు హాజరయ్యారు. ఒక్క ఎస్కే జోషి మాత్రం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కమిషన్​ ఎదుట తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపరమైన, ఆర్థికపరమైన కీలక నిర్ణయాలు ఎవరు తీసుకునేవారని ఆఫీసర్ల ద్వారా కమిషన్​ తెలుసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా బ్యారేజీల డిజైన్లను ఎవరి సూచన మేరకు మార్చారు? ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నారా? లేదంటే పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా? అని ప్రశ్నించినట్టు తెలిసింది.  తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉన్నప్పటికీ మేడిగడ్డకు  మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? బ్యారేజీల నిర్మాణానికి కాంట్రాక్ట్​ సంస్థలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? పెద్దసంఖ్యలో సబ్​కాంట్రాక్టర్లు పనులు చేసినా ఎందుకు వారించలేదు?  ఇన్​టైంలో పూర్తయినా అంచనాలను ఎందుకు పెంచాల్సి వచ్చింది? 90వేల కోట్ల నిధులు ఎలా సమీకరించారు?  ఇలాంటి అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన కమిషన్​, ఉన్నతాధికారులు చెప్పిన అన్ని విషయాలను వారంలోగా అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని ఆదేశించింది.

విధాన నిర్ణయాలేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎస్​ల హోదాల్లో ఎస్కే జోషి, సోమేశ్​ కుమార్​ తీసుకున్న నిర్ణయాలపై కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ ఆరా తీసినట్టు తెలిసింది. ప్రాజెక్ట్​ నిర్మాణం, ప్రారంభం దగ్గర్నుంచి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయే దాకా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. రూ.లక్ష కోట్లు పెట్టి కడుతున్న ప్రాజెక్టుపై తీసుకున్న విధానపరమైన నిర్ణయాలేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రాసెస్​ ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారా? పైనుంచి ఏమైనా ఒత్తిడులు  వచ్చాయా? డిజైన్లు మార్చాలంటూ గత సర్కార్​ ఆర్డర్​ చేసిందా? లేదా ఇరిగేషన్​ అధికారుల నుంచి ప్రపోజల్స్​ వెళ్లాయా? వంటి ప్రశ్నలను సంధించినట్టు తెలిసింది. ఇలాంటి విషయాల్లో ఎవరు ఎవరితో కమ్యూనికేట్​చేసేవారని ప్రశ్నించినట్టు సమాచారం. ఇరిగేషన్​ సెక్రటరీలుగా వికాస్​రాజ్​, రజత్​కుమార్ తీసుకున్న నిర్ణయాలపై జస్టిస్​ ఘోష్​ ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన రజత్​కుమార్​ నుంచి.. ఆ ప్రాజెక్టులో జరిగిన కీలక ఆర్థిక అంశాలపై కమిషన్​ ప్రశ్నించినట్టు తెలిసింది. స్మితా సభర్వాల్​ను దాదాపు గంటపాటు కమిషన్​ విచారించింది. టెండర్లు పిలిచిన విధానం.. సంస్థలకు అప్పగించిన తీరు.. ప్రాజెక్టులో అంచనాల పెంపు వంటి విషయాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. తొలుత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి ఏపీ సర్కారు ప్రతిపాదించినా.. దానిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని జస్టిస్​ఘోష్​ ప్రశ్నించినట్టు తెలిసింది.

 ప్రాణహిత వద్ద నీటి లభ్యత ఉందని 2015లో రిటైర్డ్​ ఇంజినీర్ల కమిటీ స్పష్టం చేసినా.. దానిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అడిగినట్టు చెప్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత దాని మెయింటెనెన్స్​ బాధ్యత ఎవరిదని, అది నిర్మాణ సంస్థ బాధ్యతే అయితే ఓ అండ్​ ఎం విషయంలో ఆ సంస్థను ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు ఎంత? కట్టాక ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారు? అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ఎక్కడి నుంచి చేశారు? అని అధికారులను కమిషన్​ ప్రశ్నించినట్టు తెలిసింది. బడ్జెట్​లో కేటాయించారా? బడ్జెటేతర కేటాయింపులా? అని ఆరా తీసినట్టు సమాచారం. రుణాలు ఎంత తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్​ ద్వారా రుణ సమీకరణ ఎంత చేశారు? ఎంత మేర తిరిగి చెల్లించారు? నెలవారీ కడుతున్న వడ్డీలెంత? ఇంకా ఎంత కాలం దానికి వడ్డీలు, అసలు చెల్లించాలి? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు అంచనా వేసిన ఖర్చు.. పూర్తయ్యే నాటికి అయిన ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారని సమాచారం. 

అఫిడవిట్ల సమర్పణకు వారం గడువు..

అధికారులు చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ల రూపంలో సమర్పించాల్సిందిగా జస్టిస్​ పీసీ ఘోష్​ ఆదేశించినట్టు తెలిసింది. తమ హయాంలో జరిగిన అన్ని వివరాలనూ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పినట్టు తెలిసింది. ఆ వివరాలను అఫిడవిట్ల రూపంలో ఇచ్చేందుకు కమిషన్​ వారం గడువు విధించినట్టు సమాచారం. అయితే, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు మాత్రం ఆగస్టు 5 వరకు గడువు కోరినట్టు తెలిసింది. మరో వారంలో అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలున్నందున.. బడ్జెట్​ ప్రిపరేషన్​లోనే తలమునకలవుతున్నామని, బడ్జెట్​సెషన్​ పూర్తయ్యాక అఫిడవిట్​ సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని జస్టిస్​ ఘోష్​ను కోరినట్టు తెలిసింది. అందుకు జస్టిస్​ ఘోష్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.