- ఓటర్లకు అర్వింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పోలీసుల సమక్షంలోనే ప్రజలకు డబ్బులు పంచుతూ బీజేపీ నేతలు ఓట్లు కొంటున్నారని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారు బహిరంగంగా డబ్బు, మద్యం, గోల్డ్ చెయిన్లు పంచుతున్నారని శుక్రవారం ‘ఎక్స్’ లో ఆయన ఓ వీడియో పోస్టు చేశారు.
బీజేపీ నేతలు ఇస్తున్న డబ్బు తీసుకోవాలని, కానీ.. ఓటును అమ్ముకోవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ నేతలు పంచుతున్న డబ్బంతా ప్రజలను లూటీ చేసిన డబ్బే అని, వాస్తవానికి అదంతా ప్రజల సొమ్మే అని పేర్కొన్నారు. ‘‘సాధారణంగా పోలింగ్ కు ఒకరాత్రి ముందు నేతలు చక్రం తిప్పుతారు.
కానీ, ఢిల్లీలో బీజేపీ నేతలు నెలన్నర రోజులుగా ప్రజలకు డబ్బు, మద్యం, గోల్డ్ చెయిన్లు, బూట్లు, దుప్పట్లు, రేషన్ సరుకులు పంచుతున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నది. పోలీసులు దగ్గరుండి బీజేపీ నేతలకు సహకరిస్తున్నారు.
ఎన్నికల సంఘం, చట్టాలపై ఎవరికీ భయం లేదు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. బీజేపీ నేతలకు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ దేశ ప్రజలను ఆ పార్టీ నేతలు లూటీచేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ డబ్బునే వారు ఓటర్లకు పంచుతున్నారు” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటును అమ్ముకోరాదని, ఓటు వెలకట్టలేనిదన్నారు. మనకు అంత సులభంగా ఓటుహక్కు రాలేదని, అందుకోసం రాజ్యాంగ నిపుణులు ఎంతో కష్టపడ్డారని ఆయన చెప్పారు.