న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలల గడువు ఉండగానే పాదయాత్ర స్టార్ట్ చేసిన కేజ్రీవాల్లో ప్రజల్లోకి వెళ్లి జోరుగా ప్రచారం చేస్తు్న్నారు. ఓ వైపు ఎన్నికల కసరత్తు చేస్తూనే.. మరోవైపు హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆటో డ్రైవర్లకు మంగళవారం (డిసెంబర్ 10) కేజ్రీవాల్ ఎన్నికల తాయిళాలు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆటో డ్రైవర్లకు హామీల వర్షం కురిపించారు కేజ్రీవాల్. ఎవరైనా ఆటోడ్రైవర్ కూతురి పెళ్లి చేస్తే ఆ కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహయం చేస్తోందని హామీ ఇచ్చారు. అలాగే.. దేశ రాజధానిలో ఆటో డ్రైవర్లకు హోలీ, దీపావళి పండుగలకు కొత్త బట్టల కొనుక్కునేందుకు రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ప్రమాదం జరిగితే ఢిల్లీ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా, రూ.10 లక్షల జీవిత బీమా కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.
ALSO READ | నెలలో మూడున్నర కోట్ల విలువైన 1100 ఫోన్లు రికవరీ
వీటితో పాటుగా ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పించడం కోసం పుచో యాప్‌ని మళ్లీ ప్రారంభించనున్నట్లు హామీ ఇచ్చారు కేజ్రీవాల్. ఆప్ హామీలతో ఢిల్లీలోని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 70 స్థానాలకు గాను ఏకంగా 62 సీట్లు గెల్చుకుని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అఖండ విజయం సాధించింది. ఆప్ గ్రాండ్ విక్టరీతో రెండోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టారు.
అయితే, దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ లిక్కర్ స్కామ్‌కు సంబంధి కేజ్రీవాల్‌పై కేసులు నమోదు చేయడంతో ఆయన జైలుకు వెళ్లారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఢిల్లీ ప్రజలు తిరిగి మళ్లీ ఆప్‌ను గెలిపించి తనకు క్లీన్ చిట్ ఇచ్చాకే సీఎం పగ్గాలు చేపడతానని శపథం చేశారు.
ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ ప్రకటించిన ఎన్నికల తాయిళాలు:
1. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.5 వేల యూనిఫామ్ అలవెన్స్
2. ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత భీమా
3. ఆటో డ్రైవర్లకు కుమార్తెల వివాహానికి రూ.లక్ష ఆర్థిక సహయం
4. ఆటో డ్రైవర్ల పిల్లలకు యాప్ ద్వారా ఉచిత కోచింగ్