న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 3 హామీలు నేరవేర్చలేకపోయానని.. రాబోయే ఐదేళ్లలో వాటిని పూర్తి చేస్తామని మరోసారి వాగ్ధానం చేశారు. శనివారం (జనవరి 18) కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను 3 వాగ్దానాలను నెరవేర్చలేకపోయా. యమునా నదిని క్లీన్ చేయడం.. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం, ఢిల్లీ రోడ్లను యూరోపియన్ రోడ్లలా తయారు చేయడం. ఈ మూడు హామీలు నేరవేర్చడం కోసం చాలా ప్రయత్నించాం. కానీ సాధ్యపడలేదు. ఈ మూడు పనులు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ALSO READ | దేశంలో 65 లక్షల మందికి ఆస్తి కార్డులు: మోదీ
మరో 15 రోజుల్లో ఎన్నికల జరగనున్న వేళ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కేజ్రీవాల్ అంగీకరించడం ఢిల్లీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. 2025, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనున్నారు. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా ఆప్, కాంగ్రెస్, బీజేపీ రాహోహోరీగా తలపడుతున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం అధికార్ ఆమ్ ఆద్మీ ప్రచారం హోరెత్తిస్తుండగా.. ఎలాగైనా ఢిల్లీలో జెండా పాతాలని కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే.