మాజీ సీఎం కేజ్రీవాల్‎పై దాడి.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణలు

మాజీ సీఎం కేజ్రీవాల్‎పై దాడి.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‎పై దాడి జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 25) ఢిల్లీలోని వికాస్‎పురిలో పాదయాత్ర చేస్తోన్న కేజ్రీవాల్‎పై బీజేపీ గుండాలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్‎పై దాడి సమయంలో పక్కనే ఉన్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను ఆపలేదని ఆప్ ఆరోపణలు గుప్పించింది. ఢిల్లీ పోలీసులు బీజేపీ గుండాలతో కలిసి పోయారని విమర్శించింది. కాగా, కేజ్రీవాల్‎పై జరిగిన దాడి ఘటనపై ఢిల్లీ సీఎం అతిషి రియాక్ట్ అయ్యారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయాలు ఎంత నీచానికి దిగజారిపోతాయో ఢిల్లీ ప్రజలు చూశారన్నారు.  

ఎన్నికల్లో కేజ్రీవాల్ ను, ఆప్ ను ఓడించలేమని.. ఈ విషయం బీజేపీకి తెలుసని.. అందుకే పాదయాత్ర చేస్తోన్న కేజ్రీవాల్ పై ఎటాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‎పై దాడిని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఖండించారు. బీజేపీ తన గూండాల ద్వారా ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత బీజేపీదేనని అన్నారు. ఇలాంటి దాడులకు మేం భయపడబోమని స్పష్టం చేశారు.