ప్రొఫెసర్ సాయిబాబా ఓ జ్ఞాన శిఖరం

ప్రొఫెసర్ సాయిబాబా ఓ జ్ఞాన శిఖరం

ప్రొఫెసర్  జీ.ఎన్. సాయిబాబా ఓ జ్ఞాన శిఖరం.  ఆయన  స్వరం,  మాట ఒక అలజడి.  ఆయన రాత  ఒక ప్రళయం.  ఆయన కలం కోట్లాది మందిని కదిలించిన జన చైతన్యం.  ఆయన మార్గం వేలాది మందికి స్ఫూర్తి.  విద్యావేత్తగా, రచయితగా,  ఉద్యమకారుడిగా,  సామాజికవేత్తగా ఆయన  ఆదర్శ ప్రాయుడు.  ఇంతటి  మేధా సంపత్తి  కలిగిన  ప్రొఫెసర్  సాయిబాబా   కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ శనివారం 12, 2024న   తుదిశ్వాస విడిచాడు.  దేశ రాజధానిలోని  ఢిల్లీ  విశ్వవిద్యాలయంలో  అసిస్టెంట్ ప్రొఫెసర్​గా  పనిచేసిన గోకరకొండ  నాగ సాయిబాబా ఆంధ్రా ప్రాంతంలోని  తూర్పుగోదా

వరి  జిల్లా  అమలాపురంలో జన్మించాడు.  నిరుపేద  కుటుంబంలో పుట్టిన సాయిబాబాకు  ఐదు సంవత్సరాల వయసులో  పోలియో సోకడంతో తన  రెండు కాళ్ళను పూర్తి స్థాయిలో కోల్పోయి దివ్యాంగుడయ్యాడు.  ఉన్నత విద్య కోసం భాగ్యనగరం చేరుకుని హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందాడు. అలాగే ఇఫ్లూ యూనివర్సిటీ నుంచి మరొక  పీజీ పూర్తి చేసిన అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి  పీహెచ్డీ పూర్తిచేసి  డాక్టరేట్ పట్టా  అందుకున్నాడు.  ఆ తరువాత  ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని  ఆనంద్ కాలేజీ ఇంగ్లీష్​ విభాగంలో లెక్చరర్​గా పనిచేశారు. 

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర

విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన సాయిబాబా క్రమంగా వామపక్ష రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు.  దాంతో  ఏఐపీఆర్ఎఫ్ (ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం)లో  చేరాడు. 1992లో  సెంట్రల్ యూనివర్సిటీలో  చదువుతున్న సందర్భంలో  ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1995లో  అదే సంస్థకు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆ తరువాత ఆర్డీఎఫ్  అనే సంస్థలో పనిచేశాడు.  దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలపై ఆయన స్పందించేవాడు. సమాజంలోని అనేక  సమస్యలపై  ఒక రచయితగా నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా రాయగలిగాడు.

మానవ హక్కుల ఉద్యమకారుడు

మానవహక్కుల ఉద్యమకారుడిగా తన గళాన్ని వినిపిస్తూ,  పుస్తకాలు,  పత్రికల్లో వ్యాసాలు రాస్తూ , విద్యార్థులకు పాఠాలు బోధించే  సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో మహారాష్ట్ర  పోలీసులు అరెస్టు చేశారు. 2016 వరకు జైలులో ఖైదీగా ఉన్నారు. కొంత కాలానికి బెయిల్ పై విడుదలయ్యారు. కానీ,  ఎన్ఐఏ  ఈ కేసు విచారణతో 2017లో గడ్చిరోల్లి కోర్టు ఆయనకు జీవిత ఖైదీగా శిక్ష విధించింది.  దాంతో సాయిబాబా  నాగపూర్ జైలు సెల్ లో ఒంటరిగా శిక్షను అనుభవించాడు.  బెయిల్ లభించకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది.  పది సంవత్సరాలు జైలులో గడిపాడు. అది అన్యాయం అని గ్రహించిన విద్యావంతులు, బుద్ధిజీవులు,  ప్రజా సంఘాలు,  విద్యార్థి సంఘాలు  తీవ్రస్థాయిలో వ్యతిరేకించి నిరసన కార్యక్రమాలతో  న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో, ముంబయి హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో 2024 మార్చి 7న విడుదలయ్యాడు.  ఇటీవల పలురకాల ఆనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సాయిబాబాకు చికిత్స పొందుతున్న సందర్భంలో పరిస్థితి విషమించి గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించడంతో ఈ దేశం గొప్ప జ్ఞాన శిఖరాన్ని  కోల్పోయింది.  

ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్​ డిక్లరేషన్​

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని సమర్థించాడు.  మొదటి నుంచి  ప్రజాస్వామిక  తెలంగాణ  ఏర్పాటు కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక వేదికలపై  ప్రసంగించారు.  ఉద్యమ నేపథ్యంలో 1997లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వరంగల్ డిక్లరేషన్ పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో కాళోజీ, వరవరరావు, గద్దర్,  జయశంకర్ లతో  కలిసి సాయిబాబా పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి ప్రసంగించారు. 

- ఎనుపోతుల వెంకటేష్