
- దీపాదాస్సమక్షంలో చేరిన బీఆర్ఎస్ నేత బాబా ఫసీయుద్దీన్
- పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బీఆర్ఎస్ నేత బాబా ఫసీయుద్దీన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాగా, ఫసీయుద్దీన్ అంతకుముందు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు.
ఇటీవలి కాలంలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చడం లేదని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం 22 ఏండ్లుగా పనిచేస్తున్నానని, అలాంటిది మూడేండ్ల నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనపై కక్షగట్టి రాజకీయ అణచివేతకు గురిచేసినా పట్టించుకోలేదని చెప్పారు. అప్పటి నుంచి తన పరిస్థితి ప్రతిపక్ష నేత కన్నా దారుణంగా మారిందన్నారు. తన కుమారుడిని ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి యాక్సిడెంట్ చేయించి రాక్షసానందం పొందారని ఆరోపించారు.
ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తనను ఓ రౌడీషీటర్‌తో హత్య చేయించేందుకు కుట్రలు పన్నారని, పక్కా ఆధారాలతో వచ్చినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే రక్షణ లేని చోట, పార్టీ సిద్ధాంతాలు దారి తప్పిన చోట, కార్యకర్తలకు భరోసా లేని చోట తాను కొనసాగలేనని స్పష్టం చేశారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.