టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్, సభ్యులు వీరే

  • టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి
  • ఆమోద ముద్రవేసిన గవర్నర్
  • ఐదుగురు సభ్యుల నియామకం
  • మాజీ డీజీపీకి అతిపెద్ద టాస్క్
  • అస్తవ్యస్తంగా మారిన కమిషన్
  • నిరుద్యోగులకు భరోసా కలించాలి
  • పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే బాధ్యత
  • 8 నెలల్లో పదవీకాలం పూర్తి 

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర సర్కారు పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు. మహేందర్ రెడ్డితోపాటు సభ్యులుగా అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావు ను నియమించారు. 

మాజీ పోలీస్ బాస్ కు అతిపెద్ద టాస్క్

గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దెబ్బ తీసింది. దీనిపై సిట్ విచారణ సైతం జరిగింది. గ్రూప్ –1 పరీక్ష మూడు సార్లు రద్దు కావడంతో నిరుద్యోగులకు కమిషన్ మీద నమ్మకం పోయింది. మొత్తం 20 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో వాటన్నింటినీ రద్దు చేసింది. హైకోర్టులో కేసు నడిచింది. ఇందుకు బాధ్యులైన వారు జైలు పాలయ్యారు. పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని భావించారు. కమిషన్ చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేసి గవర్నర్ కు పంపింది. ఇవాళ గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసింది.  

ఫ్రెండ్లీ పోలీసింగ్కు ఆద్యుడు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కిష్టాపురంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలోనే ఆయన బాల్య విద్య సాగింది.  రామగుండం ఏఎస్పీగా, నిజామాబాద్‌, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. ఐదేళ్లపాటు ఎన్పీఏలో బాధ్యతలు నిర్వర్తించారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన సైబరాబాద్‌ కమిషనరేట్‌కు మొదటి కమిషనర్‌గా విధులు నిర్వహించి అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు.

ఆ తర్వాత గ్రేహౌండ్స్‌, పోలీసు కంప్యూటర్స్‌ విభాగాల్లోనూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. స్నేహపూర్వక పోలీసింగ్‌ పేరుతో అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పోలీస్‌ స్టేషన్లను ఆధునికీకరించడంలో తనదైన భూమిక పోషించారు. 2017 నవంబర్‌లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి 2022 డిసెంబర్‌ వరకు ఆ పదవిలో కొనసాగారు. 

సభ్యులుగా ఐదుగురు

టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్ర, జేఎన్టీయూ ప్రొఫెసర్ యాదయ్య, ట్రాన్స్  కోలో పనిచేసి పదవీ విరమణ పొందిన రామ్మోహన్ రావును, ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పాల్వాయి రజినీ, అమీర్ ఉల్లాఖాన్ కు సభ్యులుగా ప్రభుత్వం అవకాశ కల్పించింది. వీరిలో అనితా రాజేంద్ర రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా, పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా, ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రొఫెసర్ యాదయ్య జేఎన్టీయూ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు.