- మరో నలుగురి పరిస్థితి విషమం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శివ్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ అవతార్ క్రిషన్ రైనా(81) కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. క్రిషన్ రైనాతో పాటు ఆయన ఆరేండ్ల మనవడు అద్విక్, కూతురు బర్ఖా రైనా, కొడుకు తకాశ్, గంగా భగత్, డానిశ్ భగత్(15 ) మృతిచెందినట్లు వివరించారు.
స్వర్ణ (అవతార్ క్రిషన్ రైనా భార్య), నీతూ దేవి, అరుణ్ కుమార్, మరో మహిళకు గాయాలు అయినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో రిటైర్డ్ పోలీసు అధికారి కుటుంబం అద్దెకు ఉంటున్నదని పోలీసులు వెల్లడించారు. ఇంట్లో మొత్తం పది మంది ఉన్నారని.. ప్రమాదం జరిగిన టైంలో వారంతా గాఢ నిద్రలో ఉన్నారన్నారు.
ఇల్లంతా పొగతో నిండిపోవడంతో ఊపిరాడక ఆరుగురు చనిపోయినట్లు చెప్పారు. మంటలను గమనించిన స్థానికులు బాధితులను కతువా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారని వివరించారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి ట్విట్టర్లో సంతాపం తెలిపారు.