ప్రొఫెసర్​ సాయిబాబా కన్నుమూత

ప్రొఫెసర్​ సాయిబాబా కన్నుమూత
  • అనారోగ్యంతో నిమ్స్​లో తుదిశ్వాస
  • ఎల్వీ ప్రసాద్​ దవాఖానకు కండ్లు దానం
  • నేడు ఉదయం 9 గంటలకు గన్​పార్క్​కు భౌతికకాయం
  • అనంతరం గాంధీ మెడికల్​ కాలేజీకి అప్పగింత

పంజాగుట్ట, వెలుగు: మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, ప్రొఫెసర్​ సాయిబాబా(59) కన్నుమూశారు. అనారోగ్యంతో నిమ్స్​ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 19న దవాఖానలో చేరిన ఆయనకు అదే నెల 28న డాక్టర్లు గాల్​బ్లాడర్ ఆపరేషన్​ చేశారు. గాల్ బ్లాడర్​ తొలగించి స్టంట్​ వేసిన చోట చీము పట్టడంతో .. తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. డాక్టర్లు చికిత్స అందించినా ఇతర అనారోగ్య కారణాలతో పరిస్థితి విషమించి.. గుండెపోటుతో కన్నుమూశారు. సాయిబాబా స్వస్థలం ఏపీలోని అమలాపురం. తల్లిదండ్రులు సత్యనారాయణ, సూర్యవతి. ఐదేండ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. ఆయనకు భార్య వసంతకుమారి, బిడ్డ మంజీరా, సోదరుడు రాందేవ్​ఉన్నారు. మానవ హక్కుల ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి నాగపూర్​జైలులో పదేండ్ల పాటు ఉన్నారు. 

జీవిత ఖైదు నుంచి నిర్దోషిగా..

ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ ఆనంద్ కాలేజీలో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే వామపక్ష రాజకీయాల వైపు ఆయన ఆకర్షితులయ్యారు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ లో చేరి 1992లో హైదరాబాద్​వర్సిటీలో చదివేటప్పుడు ఏపీ కమిటీకి కార్యదర్శి అయ్యారు. 1995లో ఇండియా ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న సాయిబాబాను 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ, భీమా కోరేగావ్ కేసులో ఉన్నారంటూ అన్​లాఫుల్​ యాక్టివిటీస్​ ప్రివెన్షన్​ యాక్ట్​ (ఉపా) కింద కేసు పెట్టిన మహారాష్ట్ర పోలీసులు.. నాగ్​పూర్​జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయనకు 2017లో గడ్చిరోలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్​పూర్​ జైలులో ఉన్నప్పుడు ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2022లో బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా.. అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో  స్టే వచ్చింది. 2023 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరోసారి విచారణ జరిపిన బాంబే హైకోర్టు  నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. కానీ, దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టు తలుపుతట్టగా మొదట్నుంచీ విచారణ జరపాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సరైన ఆధారాలూ లేవంటూ ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అరెస్టయినప్పుడే 2014లో ఢిల్లీ యూనివర్సిటీ సాయిబాబను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. 

జైల్లో వేధించిన అనారోగ్య సమస్యలు

సాయిబాబా పదేండ్ల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ టైంలో ఆయనను అనేక అనారోగ్య సమస్యలు వేధించాయి. అనారోగ్యం దృష్ట్యా తనకు బెయిల్​ఇవ్వాలని ఎన్నిసార్లు కోర్టులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. జైల్లో సరైన సదుపాయాలు లేవని, కరోనా వైరస్ తో చంపడానిక కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడి సర్కారు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్ తిరగని సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచారని సాయిబబా అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చినా అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. గత నెలలో నిమ్స్​లో చేరగా గాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేశారు. అక్కడ చీము పట్టడంతో పరిస్థితి విషమించి చివరికి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నిమ్స్​మార్చురీలో భద్రపరిచిన సాయిబాబా భౌతికకాయాన్ని ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న , ప్రొఫెసర్​ఖాసీం, చెరుకు సుధాకర్  తదితరులు సందర్శించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

కండ్లు, డెడ్​బాడీ దానం

సాయిబాబా కోరిక మేరకు కుటుంబసభ్యులు ఆయన కండ్లను ఎల్వీ ప్రసాద్​ దవాఖానకు దానం చేశారు. డెడ్​బాడీని గాంధీ  మెడికల్​ కాలేజీకి అప్పగించనున్నారు. నిమ్స్​ మార్చురీ నుంచి సాయిబాబా భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు గన్​పార్క్​ వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ 15 నిమిషాలపాటు సందర్శన కోసం ఉంచుతారు. అనంతరం జవహర్​నగర్​మౌలాలి కమాన్​ దగ్గర ఉన్న సోదరుడి ఇంటికి తరలించి మధ్యహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. అనంతరం గాంధీ మెడికల్​ కాలేజీకి సాయిబాబా భౌతికకాయాన్ని అప్పగిస్తారు. 

ప్రజల పక్షపాతి: సీతక్క

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సమాజంలో అసమానతను రూపుమాపేందుకు జీవితాంతం పోరాడిన గొప్ప మానవతావాదని, ప్రజా పక్షపాతి అని మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు. సాయిబాబా మృతి పట్ల ఆమె సంతాపం తెలిపారు. తప్పుడు కేసుల్లో ఎంతోకాలం జైలు జీవితాన్ని గడిపినా.. చివరిదాకా సాయిబాబా ప్రజల కోసం పని చేశారని కొనియాడారు. 

పోరాట యోధుడు : నారాయణ

ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి రాజీలేని పొరాటంలో విజయం సాధించిన యోధుడు ప్రొఫెసర్ సాయిబాబా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సాయిబాబా మృతి పట్ల ఆయన  సంతాపం తెలిపారు. పోరాటయోధుడు సాయిబాబా భౌతికంగా మనతో లేకపోయినా పోరాట రిత్యా మనతోనే ఉన్నారన్నారు. సాయిబాబా మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని  ప్రకటించారు. సాయిబాబా మరణం సమాజానికి తీరని లోటని అన్నారు.

సాయిబాబాకు సీపీఎం సంతాపం

జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిబాబా మృతికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆయన జైల్లో ఉన్న టైంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, గిరిజన, దివ్యాంగుల హక్కుల నేతగా, విద్యావేత్తగా పేరొందిన ఆయన మృతి.. ప్రజా ఉద్యమానికి తీరని లోటని అన్నారు.