కరోనా భారినపడి మహారాష్ట్రకు చెందిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు శనివారం మరణించాడు. హంజా కోయా అనే 61 ఏళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్ కుటుంబం కేరళలో స్థిరపడింది. వారి కుటుంబం కొన్ని పనుల నిమిత్తం ముంబై వెళ్లి మే 21న కేరళకు వచ్చారు. మే 26న కోయా కరోనా లక్షణాలతో బాధపడుతూ మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో చేరాడు.
కోయా న్యుమోనియా మరియు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జూన్ 5న కోయా ఆరోగ్యం క్షీణించడంతో.. రాష్ట్ర ఆరోగ్య శాఖ సలహా మేరకు మంజేరి ఆస్పత్రి వైద్యులు కోయాకు ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. అయితే కోయా ప్లాస్మా థెరపీకి ఏమాత్రం కోలుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శనివారం ఉదయం 6:30 గంటలకు తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా.. కోయా భార్య, కొడుకు, కోడలు మరియు వారి పిల్లలిద్దరు కూడా కరోనా బారినపడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారందరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కోయా మృతితో కరోనాతో కేరళలో మరణించిన వారి సంఖ్య 15కి చేరుకుంది. హంజా కోయా భారత్ మరియు మహారాష్ట్రల తరపున సంతోష్ ట్రోఫీలో పాల్గొన్నాడు.
For More News..