
రాయికల్/మెట్‌పల్లి, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ యువతకు వృత్తి, విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించే ఏర్పాట్లు చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కోరారు. బుధవారం రాయికల్ మండలం చిన్నజీయర్ స్వామి ట్రస్టు భవనంలో, ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. హోమ్ ఎయిడ్, హెల్త్ నర్సింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, టైలరింగ్, బ్యూటిషియన్.. వంటి ఉపాధి కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకు ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మండలంలో నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ప్రోగ్రాం అధికారి మహేశ్, ప్రతిమ ఫౌండేషన్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్, మేనేజర్ గీతారెడ్డి, చిన్న జీయర్ ట్రస్ట్ ఇన్‌చార్జి ఏఎం రాజురెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు రాజారెడ్డి, రఘుపతి, శ్యామల పాల్గొన్నారు.