యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన నరసింహన్ దంపతులకు ఈఓ రామకృష్ణారావు ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో నరసింహన్ దంపతులకు ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వేదాశీర్వచనం చేయగా.. ఈఓ రామకృష్ణారావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. దర్శనం అనంతరం యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్ లో శుక్రవారం రాత్రి బస చేసిన నరసింహన్ దంపతులు.. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం స్వామివారి అభిషేకంలో పాల్గొననున్నారు. తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.