హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ బీజేపీ -ఎన్నికల కో ఆర్డినేటర్ గా మాజీ గవర్నర్ తమిళిసైకి ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ప్రచారం పర్వం పూర్తయ్యే వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. తొలుత సికింద్రాబాద్ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించాలని భావించినా.. ఆ తర్వాత నిర్ణయం మార్చినట్టు తెలిసింది. అయితే, అవసరాన్ని బట్టి ఇతర సెగ్మెంట్లలోనూ ఆమెతో ప్రచారం చేయించాలని పార్టీ నిర్ణయించింది.
కాగా, తొలుత హైదరాబాద్ లోక్ సభ ఇన్చార్జ్గా ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కానీ, తనను సంప్రదించకుండానే మాధవీ లతను అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇన్చార్జ్ గా ఎవరూ లేకుండా పోయారు. దీంతో తమిళిసైకి రాష్ట్రంపై కొంత పట్టు ఉండడంతో ఆమెను కో ఆర్డినేటర్ గా పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
నేడు అమిత్ షా రోడ్ షో..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహంకాళి ఆలయం లాల్ దర్వాజ నుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు రోడ్ షో ఉంటుందని పార్టీ మీడియా ఇన్చార్జ్ ఎన్వీ సుభాష్ తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు అటెండ్ కానున్నారు.