నేటితో ముగియనున్న HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ

నేటితో ముగియనున్న HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ

HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ నేటీతో(ఫిబ్రవరి 7) ముగియనుంది. ఏడు రోజులుగా విచారించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు కోరనున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో అక్రమాస్తులతో పాటు బినామీలను గుర్తించారు. బినామీలందరిని విచారించేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. కాబట్టి శివబాలకృష్ణ మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు నిన్న(ఫిబ్రవరి 6) అరెస్టు చేశారు. నవీన్ పేరుపై కూడా మరికొన్ని ఆస్తులను గుర్తించారు అధికారులు. 

HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ సైతం బినామీగా ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. భరత్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలిసింది. 120 ఎకరాల భూములు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు మరికొంత మంది బినామీలను గుర్తించారు. ఇప్పటికే పలువురు బినామీలు, HMDA ఉద్యోగులను సైతం ఏసీబీ అధికారులు విచారించారు. నేడు మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది. నాలుగు రోజులుగా HMDA ఆఫీసులోని 4, 7 అంతస్థుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. శివ బాలకృష్ణకు సంబంధించిన అన్ని ఫైళ్లకు సంబంధించిన అనుమతులను ఏసీబీ టీం తనిఖీ చేసింది. విచారణ ముగిసిన తర్వాత శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరుచనున్నారు అధికారులు.

Also Read :ఆర్థిక శాఖ మంత్రితో పేటీఎం CEO భేటీ