బషీర్ బాగ్, వెలుగు: ఎల్బీస్టేడియం వద్ద శనివారం మాజీ హోంగార్డు వీరాంజనేయులు హల్చల్ చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ స్టేడియం ఆవరణలోని ఫ్లడ్ లైట్స్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏండ్లు విధులు నిర్వహించానని, తనతోపాటు 250 మందిని అన్యాయంగా విధుల నుంచి తొలగించారని వాపోయాడు. తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామనే కారణంతో అప్పటి ప్రభుత్వం తమపై కక్షగట్టి విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అధికారంలోకి రాగానే తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఏడాదైనా ఎందుకు పట్టించుకోవడం లేదన్నాడు. సైఫాబాద్పోలీసులు అక్కడికి చేరుకుని, అతనికి నచ్చజెప్పి, డిజాస్టర్రెస్పాన్స్టీమ్ తో కలిసి భారీ క్రేన్ లో వీరాంజనేయులను కిందికి దించారు. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరాంజనేయులు టవర్ ఎక్కినట్లు ఎల్బీ స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దాదాపు 8 గంటలుగా టవర్ పైనే కూర్చొని నిరసన తెలిపాడన్నారు.