- సైదిరెడ్డి కబ్జాలకు వ్యతిరేకంగా గతంలో బీజేపీ గుర్రంబోడులో ఆందోళన
- అప్పట్లో బీజేపీ లీడర్లపై లాఠీచార్జి
- దాడులు చేయించిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారంటూ స్థానిక లీడర్ల ఆగ్రహం
- ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే తాడోపేడో తేల్చుకుంటామంటున్న సీనియర్లు
సూర్యాపేట, వెలుగు : బీఆర్‌ఎస్ నేత, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన పార్టీలో చేరుతారన్న ప్రచారం మొదలైనప్పటి నుంచే స్థానిక బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో గిరిజనుల భూములను ఆక్రమించారని సైదిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.
ఈ భూముల కోసం అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో గిరిజన రైతుల పక్షాన ఆ పార్టీ నేతలు చేసిన భూ పోరాటం 2021 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ నేతలు, పోలీసుల దాడిలో పలువురు గాయపడగా, ఉల్టా 30 మంది కేసుల పాలయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలం పుంజుకునేందుకు గుర్రంబోడు ఘటనే కారణమైంది. అలాంటి సైదిరెడ్డిని ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడాన్ని సూర్యాపేట జిల్లాకు చెందిన బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
బీజేపీ లీడర్లపై పాశవిక దాడి..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు 540 సర్వే నంబర్‌లోని 1,876 ఎకరాల గిరిజనుల భూములను స్థానిక బీఆర్‌ఎస్ నేతలు బినామీ పేర్లతో ఆక్రమించారని, వీరి వెనుక సైదిరెడ్డి హస్తం ఉందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్రమణకు గురైన భూములను
రక్షించేందుకు ‘గిరిజన భరోసా యాత్ర’ పేరుతో బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులు గుర్రంబోడు పర్యటన చేపట్టారు. 540 సర్వే నంబర్‌లోని స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ నాయకులను నాడు ఎమ్మెల్యే హోదాలో సైదిరెడ్డి అడ్డుకోవడమే కాకుండా, లీడర్లపై భౌతిక దాడులు చేయించారు.
ఆ గొడవలో బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు చాలా మంది గాయపడ్డారు. జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డితో సహా 30 మందిపైన కేసులు పెట్టించడంతో వారంతా 80 రోజుల పాటు జిల్లా జైలులో ఉన్నారు. దీంతో పాటు వడ్ల కొనుగోళ్ల పరిశీలనకు వచ్చిన టైంలో కూడా బండి సంజయ్ కాన్వాయ్‌ని, పార్టీ లీడర్ల వాహనాలను అడ్డుకొని రాళ్లు రువ్వారు. దీని వెనుక కూడా సైదిరెడ్డే ఉన్నారని, ఆయనే బీఆర్‌ఎస్ లీడర్లను ప్రోత్సహించి దాడులు చేయించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ గొడవలో చివ్వెంల, ఆత్మకూరు, నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.
ఎంపీ టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదు
మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని బీజేపీలో చేర్చుకోవడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఆయన పర్యటనను అడ్డుకుని, కార్యకర్తలు, లీడర్లపైన దాడులు చేయించిన సైదిరెడ్డిని ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టించడంతో జైలులో సైతం గడిపామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలు, నాయకులపైన దాడులను ప్రోత్సహించిన సైదిరెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెపుతున్నారు. గతంలో సైదిరెడ్డితో విభేదించి బీజేపీలో చేరిన చల్లా శ్రీలతరెడ్డి సైతం ప్రస్తుతం ఆగ్రహంగా ఉన్నారు. కొత్తగా చేరిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని, సీనియర్లను అవమానిస్తే తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.