ఉచిత పథకాల కోసం అప్పులు చేయడం సరికాదు : జయప్రకాశ్  నారాయణ్

ఉచిత పథకాల కోసం అప్పులు చేయడం సరికాదు : జయప్రకాశ్  నారాయణ్
  • విద్య, వైద్యం, ఉపాధిపై దృష్టిపెట్టాలి
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మూడో రోజు జాతీయ సదస్సు

బషీర్​బాగ్, వెలుగు: ఉచిత పథకాల కోసం ప్రభుత్వాలు అప్పులు చేయడం సరికాదని మాజీ ఐఏఎస్​ డాక్టర్  జయప్రకాశ్  నారాయణ్  అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్యం, ఉపాది వైపు దృష్టి పెట్టేలా పాలకులు కృషి చేయాలని ఆయన సూచించారు. ‘ఆర్థిక, ఆదాయ అసమానతలు, అనుసరించాల్సిన వ్యూహాలు’ అంశంపై ఎకనామిక్  కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్  గ్రౌండ్ లో సోమవారం మూడో రోజు సదస్సులో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోణంలో ఆలోచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఉచితాల కోసం అప్పులు చెయ్యడం నిలిపివేసినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తాయన్నారు.  

అభివృద్ధి సాధించిన దేశాలతో పోలిస్తే..  మన దేశంలో విద్యా రంగానికి కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువని తెలిపారు. చైనా జీడీపీ భారతదేశ జీడీపీ కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఉందని జేపీ చెప్పారు. కాగా.. ఈ  సదస్సుకు  ఎకనామిక్  కమిటీ అధ్యక్షుడు డాక్టర్  గంగాధర్ రావు అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షుడు ఆదిత్య మార్గం, కార్యదర్శి రంగారెడ్డి, కోశాధికారి డా. వంశీ తిలక్, ఎగ్జిబిషన్  సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి , కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్, బెంగాల్ కు చెందిన మత్స్యకారుల యూనియన్  నాయకుడు ప్రదీప్  చటర్జీ, ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, కేరళకు చెందిన సామాజికవేత్త  కుసుమం జోసెఫ్, మహారాష్ట్ర నుంచి సామాజికవేత్త యువరాజ్, కర్నాటక నుంచి దళితుల సంరక్షణ సమితి నాయకులు వెంకటేశ్, మధ్యప్రదేశ్ కు చెందిన సామాజికవేత్త సునిలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వక్తలు మాట్లాడారు. సదస్సులో 35 తీన్మారాలు చేసి వాటిని ఆమోదించారు. ఆ తీర్మానాల పరిరష్కారం కోసం రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తామన్నారు.