బీఆర్‌‌ఎస్, బీజేపీని గద్దె దించాలి : ఆకునూరి మురళి

  • విద్య, వైద్య వ్యవస్థలను కేసీఆర్  సర్కారు నాశనం చేసింది

కాజీపేట, వెలుగు : బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి అవినీతి పాలన కొనసాగించారని మాజీ ఐఏఎస్  అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఓటు చైతన్య యాత్రలో భాగంగా బుధవారం హనుమకొండ, కాజీపేట, మడికొండలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్పడంలో మిగతా నాయకులకు సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. 

‘ ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే జీవితాలు మారుతాయని అందరూ భావించారని, కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, విద్య, వైద్య వ్యవస్థలను బీఆర్ఎస్  ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. బలిదానాలతో వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్, అతని కుటుంబసభ్యులు మాత్రమే బాగుపడ్డారన్నారు. మరోమారు కేసీఆర్  అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని కాపాడడం ఎవరితరం కాదన్నారు. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నర యేండ్లలో ఇచ్చిన ఒక్క హమీని కూడా నెరవేర్చలేదన్నారు. 

రాష్ర్టం నుంచి పన్నులు వసూలు చేయడం మినహా ఇక్కడ అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ప్రజలకు ఉపయోగం లేని కారు, కమలం గుర్తు పార్టీలకు ఓటర్లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి శంకర్, జిల్లా కార్యదర్శి నరేశ్, కేయూ జాక్  చైర్మన్  మంద వీరస్వామి  పాల్గొన్నారు.