David Johnson: ఆత్మహత్య చేసుకున్న భారత మాజీ క్రికెటర్

David Johnson: ఆత్మహత్య చేసుకున్న భారత మాజీ క్రికెటర్

భారత మాజీ పేసర్, కర్ణాటక రంజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్(52) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులో తన కుటుంబం నివాసముంటున్న అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. నాలుగో అంతస్థు నుండి కింద పడటంతో భారత మాజీ పేసర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గతకొంతకాలంగా తీవ్ర మైన డిప్రెషన్‌తో బాధపడుతున్న ఈ మాజీ పేసర్.. మానసిక వేధనను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

డేవిడ్ జాన్సన్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, జాన్సన్ తన ఇంటి సమీపంలో క్రికెట్ అకాడమీని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో అతను అనారోగ్యం బారిన పాడైనట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కొత్తనూరు పోలీసులు విచారణ చేపట్టారు.  నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా..! లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా..! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంతాపం తెలిపిన జయ్ షా, కుంబ్లే, గంభీర్

డేవిడ్ జాన్సన్ మృతి పట్ల బీసీసీఐ సెక్రటరీ జయ్ షా, మాజీలు అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "నా క్రికెట్ సహోద్యోగి డేవిడ్ జాన్సన్ మరణవార్త విని బాధపడ్డాను. అతని కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా త్వరగా వెళ్ళిపోయాడు " బెన్నీ"! అని కుంబ్లే తన ఎక్స్ హ్యాండిల్‌లో రాశారు.

"మా మాజీ భారత ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆటకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది." జయ్ షా తన సంతాపాన్ని తెలియజేశారు.

త్వరలో టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గౌతమ్ గంభీర్ కూడా డేవిడ్ జాన్సన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు."డేవిడ్ జాన్సన్ మరణించినందుకు చింతిస్తున్నాను. దేవుడు అతని కుటుంబానికి మరియు ప్రియమైనవారికి మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడు." గంభీర్ ఎక్స్‌లో రాశారు. 

ఆస్ట్రేలియాపై అరంగ్రేటం

పేస్‌కు పేరుగాంచిన జాన్సన్ దేశీయ సర్క్యూట్‌లో కర్ణాటక తరఫున కొన్ని చక్కటి ప్రదర్శనల ఆధారంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఆస్ట్రేలియాతో జరిగిన ఢిల్లీ టెస్ట్‌లో అరంగేట్రం చేశారు. జవగల్ శ్రీనాథ్ గాయపడటంతో, జాన్సన్ తన కర్ణాటక సహచరుడు వెంకటేష్ ప్రసాద్‌తో కలిసి బౌలింగ్ చేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అతను తొలి టెస్టులో ఆడారు. కానీ నియంత్రణ లేకపోవడంతో అతని టెస్ట్ కెరీర్ కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కొనసాగింది. అందులో అతను మూడు వికెట్లు తీశారు.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 29 గేమ్‌ల్లో 28.63 సగటుతో 125 వికెట్లు తీశాడు. లోయర్-ఆర్డర్ బ్యాటరైన జాన్సన్.. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒక సెంచరీ కూడా సాధించాడు. 33 లిస్ట్ ఏ గేమ్‌లలో 41 వికెట్లు పడగొట్టాడు. అతని చివరి మ్యాచ్ 2015లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఆడారు.