న్యూఢిల్లీ: ఐపీఎల్ చాలా మంది క్రికెటర్లను స్టార్లను చేసింది. ఈ లీగ్‌లో ఆడిన ఎంతో మంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క సీజన్‌తోనే క్రికెటర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. 2011 సీజన్‌లో ఐపీఎల్‌లో బరిలోకి దిగిన కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు తమకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ వెల్లడించాడు. ఆ సీజన్‌లో బ్రెండన్ మెకల్లమ్, మహేల జయవర్దనే, రవీంద్ర జడేజా తదితరులు కూడా కొచ్చికి ఆడగా, వేలంలో తమకు ఇస్తామన్న డబ్బులు ఎగ్గొట్టిందని తెలిపాడు.
ఆ సీజన్‌లో తమకు ఇవ్వాల్సిన జీతం బకాయిలను కొచ్చి ఫ్రాంచైజీ ఇప్పటికీ సెటిల్ చేయలేదని చెప్పాడు. ‘కొచ్చి టస్కర్స్ మాకు చాలా డబ్బులు బాకీ ఉంది. ఆ ఫ్రాంచైజీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని బీసీసీఐ ఎప్పుడో చెల్లించింది. కానీ, ఇన్నేండ్లయినా మా బకాయిలను చెల్లించడం లేదు. మా పిల్లల పెండ్లిళ్లు అయ్యే సమయానికైనా మా డబ్బు మాకు వస్తుందని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. మూడేండ్లు లీగ్‌లో ఉండాల్సిన కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీ నిబంధనలు ఉల్లంఘించడంతో ఒక్క ఏడాదికే సస్పెండ్ అయిందన్నాడు.