Unmukt Chand: భార‌త జ‌ట్టుకు ప్ర‌త్య‌ర్థిగా ఆడడ‌మే నా ల‌క్ష్యం: మాజీ క్రికెటర్‌

Unmukt Chand: భార‌త జ‌ట్టుకు ప్ర‌త్య‌ర్థిగా ఆడడ‌మే నా ల‌క్ష్యం: మాజీ క్రికెటర్‌

భారత దేశంలో పుట్టి, భారత దేశంలో పెరిగి.. తన నాయకత్వంలో దేశానికి ప్రపంచ కప్ (అండర్‌ 19) అందించిన ఓ భారత క్రికెటర్.. ఇప్పుడు సొంత దేశంపై తిరుగుబావుటా ఎగుర వేయడానికి సిద్ధమయ్యాడు. అతను మరెవరో కాదు.. ఉన్ముక్త్‌ చంద్‌. అవకాశాలు రాక దేశాన్ని వీడిన ఈ క్రికెటర్ త్వరలోనే అమెరికా తరుపున అరంగ్రేటం చేయనున్నాడు. భారత జట్టు ప్రత్యర్థిగా ఆడనున్నాడు.

ఉన్ముక్త్‌ చంద్‌ సారథ్యంలో భారత యువ జట్టు 2012 అండర్‌19 ప్రంపంచ కప్‌ విజేతగా నిలిచింది. ఆ సమయంలో అతని పేరు మార్మోగిపోయింది. భారత క్రికెట్‌లో మరో యువ కెరటం అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ, అవన్నీ మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయాయి. అరకొర అవకాశాలు వచ్చినా.. అతను అతను ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు. మున్ముందు అవకాశాలు వచ్చేది అనుమానంగా మారడంతో భార‌త క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి అమెరికా వెళ్ళిపోయాడు.   

మూడేళ్ల క్రితం(2021 సెప్టెంబరు) అమెరికా వెళ్లిన ఉన్ముక్త్‌ చంద్‌ అప్పటినుండి దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఈ ఏడాది మార్చితో అతను అమెరికా జట్టు తరుపున అరంగ్రేటం చేయడానికి అర్హత సాధించనున్నాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ.. భారత క్రికెట్ నుంచి వైదొలిగాక భార‌త జ‌ట్టుకు ప్రత్యర్థిగా ఆడడ‌మే తన ల‌క్ష్యమని తెలిపాడు.

"భార‌త క్రికెట్ నుంచి వైదొలిగాక‌.. భార‌త జ‌ట్టుకు ప్రత్యర్థిగా ఆడడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నా. అలాగ‌ని దేశంపై నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను నేను పరీక్షించుకోవాలనే ఆసక్తితో ఉన్నా.. ప్రపంచంలోని అత్యుత్తమ జ‌ట్టుపై నా స‌త్తా నిరూపించుకోవాల‌నేది నా ఉద్దేశం.." అని ఉన్ముక్త్ వెల్లడించాడు. టీ20 ప్రపంచ‌క‌ప్‌లో భాగంగా.. జూన్ 12న న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టీమిండియాతో అమెరికా జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.