పిల్లలకు అ ఆ లే వస్తలేవంట…

అ ఆ లు రాయలేకపోతున్నారు. అంకెలు వేయలేకపోతున్నారు. పేరుకి చదువుతున్నారేగానీ, పొట్టకోస్తే అక్షరం ముక్క ఉండట్లేదు.

– స్కూళ్లు, కాలేజీల్లో చదువులెట్లా ఉన్నాయో చెప్తూ ఇస్రో మాజీ చైర్మన్​ కస్తూరి రంగన్​ కేంద్ర ప్రభుత్వానికి నెల రోజుల కిందట తన రిపోర్ట్​లో పై విషయం చెప్పారు.​ చదువులు ఎట్లా సాగాలో కూడా కస్తూరి రంగన్​ రిపోర్టు వివరంగా సూచించింది. ఇస్రో కస్తూరి రంగన్​కు చదువుకు సంబంధమేంటని అనుకోవచ్చు. అయితే, చదువులమీద స్టడీ చేసి ఒక రిపోర్టు ఇవ్వాలని కేంద్ర సర్కారు​ రెండేళ్ల క్రితం కస్తూరి రంగన్​ చీఫ్​గా ఒక కమిటీ వేసింది. కమిటీ చాలా కాలం స్టడీ చేసి ఒక రిపోర్టు తయారుచేసింది. దాన్ని ఆయన కేంద్రానికి అందజేశారు.

10 వేల మందిని పరీక్షించారు

ఆ కమిటీ సభ్యులు పది వేల మందికిపైగా బడి పిల్లల చదువులు పరిశీలించారు. వాళ్లకు పరీక్ష పెడితే.. నైన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​ కూడా తెలుగు, ఇంగ్లిష్, హిందీ అక్షరాలు రాయలేకపోతుండటాన్ని గుర్తించారు. పలక, బలపం, టమాట, కోడి, బంతి వంటి చిన్న పదాలు రాయటానికే పిల్లలు కిందా మీదా పడుతున్నారు.

లెక్కల్లో మరీ పూర్​

కూడికలు, తీసివేతలు, భాగహారాలు తప్పుల్లేకుండా చేసే తెలివీ నేర్వలేదు. ఇవన్నీ వచ్చినోళ్లు పదుల సంఖ్యలోనే ఉన్నారంటే నమ్మక తప్పదు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో దేశం మొత్తం మీద పది కోట్ల మంది పిల్లలు మోటోళ్లుగానే మిగిలిపోతారు. పేరుకే బడికిపోతున్నారు గానీ పొట్ట కోస్తే అక్షరమ్ముక్క లేదు. ఇలాంటి స్టూడెంట్స్​లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలే ఉన్నారు.

మూడు సూచనలు

మూడు పనులు చేస్తే ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చని కస్తూరి రంగన్​ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అందులో ఒకటి.. స్కూల్లో బాగా చదివే పిల్లలను సెలెక్ట్​ చేసి చదువులో వెనకబడ్డోళ్లకి వాళ్లతో పాఠాలు చెప్పించాలి. వారానికి కనీసం ఐదు గంటలైనా ఇలా చేయించాలి. తోటోణ్ని కూడా చదువులో తనతో సమానం చేయటం కోసం సమయం కేటాయించే, కష్టపడే ఇలాంటి తెలివైన స్టూడెంట్స్​ని మెచ్చుకుంటూ ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వాలి. వాళ్లను మరింత ఎంకరేజ్​ చేయాలి.

దోస్త్​ మేరా దోస్త్​

టీచర్​కి, క్లాస్​మేట్​కి తేడా ఉంటుంది. టీచర్​ అంటే పిల్లలు భయపడతారు. డౌట్లు అడగటానికి జంకుతారు. అదే క్లాస్​మేట్​ అయితే ‘అది కాదురా.. ఇది కాదురా’ అంటూ ఫ్రెండ్లీగా తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటారు. సార్లు స్కూల్లోనే అందుబాటులో ఉంటారు. దోస్తులనైతే ఇంటికెళ్లి కూడా డౌట్లు అడగొచ్చు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. జోకులేసుకుంటూ ఎంజాయ్​ చేస్తూ చదువుకోవచ్చు. ముల్లును ముల్లుతోనే తీయాలంటారు కదా. అలాగే స్టూడెంట్స్​లోని లోపాలను స్టూడెంట్స్​తోనే సరిదిద్దించటం అన్న మాట.

ఊరోళ్లకి కనెక్ట్​ అవుతారు

కస్తూరి రంగన్​ కమిటీ సూచించిన రెండో ఆలోచన.. బడి ఉన్న ఊళ్లో ఇంటర్​ చదివి ఖాళీగా తిరిగే యూత్​ని గుర్తించి, వాళ్లను ట్రైనీ టీచర్లుగా తీసుకోవటం. ఈ విషయంలో అమ్మాయిలకు ప్రిఫరెన్స్​ ఇవ్వాలి. అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో ఓపిక ఎక్కువ. ఆ ట్రైనీ టీచర్లు తమ ఊరోళ్లే కాబట్టి పిల్లలు వాళ్లతో కనెక్ట్​ అవుతారు. స్కూల్​ నుంచి ఇంటికి వెళ్లాక బుక్స్​ పడుతున్నారా లేదా అనేది ట్రైనీ టీచర్లు గమనిస్తారు. చదువును అశ్రద్ధ చేసే పిల్లల విషయాన్ని వాళ్ల పేరెంట్స్​ దృష్టికి తీసుకెళతారు.  రిటైరైన ఉద్యోగులను చదువుకు సంబంధించిన కార్యక్రమాల్లో వాలంటరీగా పాల్గొనేలా చేయటం. తద్వారా వాళ్లు సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో బడి పిల్లలను, యూత్​ని ఒక చోట చేర్చి ఫ్రీగా ట్యూషన్స్​ చెప్పేలా ప్రయత్నిస్తారు. పేరెంట్స్​ పిల్లలను స్కూల్​కి రెగ్యులర్​గా పంపించేలా మోటివేట్​ చేస్తారు. టీచర్లు డ్యూటీకి సరిగా వస్తున్నారో లేదో ఓ కంట కనిపెడతారు. విద్యా కమిటీలు యాక్టివ్​గా పనిచేసేలా చూస్తారు. స్కూల్స్​లో కనీస సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వంతో మాట్లాడుతూ కోఆర్డినేట్​ చేస్తారు.

టీచర్​ కోర్సును నాలుగేళ్లకు పెంచాలి

టీచర్​ ట్రైనింగ్​ కోర్సును తప్పనిసరిగా నాలుగేళ్లకు పెంచాలని కస్తూరి రంగన్​ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కమిటీ ఇచ్చిన సూచనల్లో కొన్ని సరిగా లేవు. చదువులో వెనకబడ్డ పిల్లలను మెరుగుపరిచే బాధ్యతను తెలివైన స్టూడెంట్స్​కి, ఎడ్యకేషన్​ యాక్టివిస్టులకు, సోషల్​ వర్కర్లకు అప్పగించటం కరెక్ట్​ కాదు. ఇలా చేయటం అంటే విద్యా శాఖను ఆ బాధ్యతల నుంచి తప్పించటంగా భావించాల్సి ఉంటుంది. సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం కాదు.

ఎంత మంది చెప్పినా వినిపించుకోవట్లేదు

పిల్లలు చదువులో వెనకబడటానికి దారితీస్తున్న ముఖ్య కారణాల్లో దీన్ని కూడా ఒకటిగా గుర్తించాలని ప్రపంచ బ్యాంకు, యునెస్కో లాంటి ఇంటర్నేషన్​ ఆర్గనైజేషన్లు ఎప్పటి నుంచో గొంతు చించుకుంటున్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా విద్యా శాఖలోని ప్రతిఒక్క ఉద్యోగీ ఫీల్డ్​ లెవల్లో ఏం జరుగుతోందో పరిశీలించాలి. రోజూ ఆఫీసుల్లో ఉంటూ మీటింగ్​లు పెట్టుకుంటూ టైమ్​ వేస్ట్​ చేయకుండా రంగంలోకి దిగాలి. చదువుకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలి. మన దేశంలో చదువులు ఎలా ఉండాలనే విషయంలో 50 ఏళ్ల కిందట (1968లో) ఒక విధానం తెచ్చారు. ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతున్నాం. కస్తూరి రంగన్​ కమిటీ సూచించిన కొత్త పాలసీ అమల్లోకి వస్తే పాతది రద్దవుతుంది. 10+2+3 విధానం పోయి 5+3+3+4 పద్ధతి వచ్చే ఛాన్స్​ ఉంది. మారిన కాలానికి అనుగుణంగా చదువులు పిల్లలకు బతుకు దెరువు చూపేలా ఉండాలి. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటానికి కొత్త విధానం ఉపయోగపడాలి. – ఆర్​.వెంకట్​రెడ్డి, నేషనల్​ కన్వీనర్​, ఎంవీ ఫౌండేషన్

ఇవి తప్ప అన్ని లెక్కలూ ఉంటాయి

బడికి రోజూ ఎంత మంది పిల్లలు, టీచర్లు వస్తున్నారు? బడి బయటఉన్న పిల్లలెందరు? బడిలో మధ్యాహ్న భోజనం చేసే స్టూడెంట్స్​ సంఖ్య ఎంత? వాళ్లలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఎందరు?  మధ్యాహ్నభోజనం తిననివాళ్లు ఎంత మంది? టీచర్ల సెలవులు, స్కూల్లోని టాయిలెట్లు ఎన్ని? అందులో పనిచేసేవెన్ని? పనిచేయనివెన్ని?.. ఇలా ప్రతిదానికీ లెక్కుంది. కానీ.. బడికొచ్చే పిల్లల్లో ఎంత మందికి ‘అ ఆ’లు, ‘ఇ ఈ’లు వచ్చు? ఎంత మంది లెక్కలు బాగా చేయగలరు? అనే సమాచారం విద్యా శాఖ వద్ద లేకపోవటం విడ్డూరం.