- 67 మంది నుంచి లక్ష చొప్పున వసూలు
- ముత్తిరెడ్డి ఫాంహౌజ్‌ను ముట్టడించిన దళితులు
- ఎంపీపీ ఆధ్యర్యంలో ఆందోళన
జనగామ: జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. దళితబంధు ఇప్పిస్తానని 67 మంది నుంచి డబ్బులు తీసుకున్నాడని దళితులు ఆందోళనకు దిగారు. నర్మెట్ట మండలంలోని హనుమంతపురం శివారు రోళ్లగడ్డ తండాలోని ముత్తిరెడ్డి ఫాంహౌజ్ ముట్టడికి ఇవాళ ప్రయత్నించారు.
మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధితుల ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్కరి నుంచి 1 లక్ష వసూలు చేశాడని వారు ఆరోపించారు. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఉమ్మడి మద్దూరు మండలంలోని ధూళిమిట్ట గ్రామంలో 67 మంది దళితుల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఆ డబ్బులను ముత్తిరెడ్డికి ఇచ్చినట్లు ఆరోపించారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.