జైలు నుంచి విడుదలైన జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్

జైలు నుంచి విడుదలైన జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్

జార్ఖండ్‌ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్‌ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన   మనీలాండరింగ్ కేసులో జనవరి 31న సోరెన్‌ అరెస్ట్ కాగా  ఐదు నెలలు పాటు జైల్లోనే   ఉన్నారు.  ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, జార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.  దీంతో ఆయన ఈ రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.  హేమంత్‌ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో  ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జేఎంఎం కార్యకర్తలు. 

పార్టీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా హేమంత్‌ సోరెన్ మీడియాతో  మాట్లాడుతూ మనీలాండరింగ్ కేసులో తనను తప్పుగా ఇరికించారని, దాదాపు ఐదు నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని చెప్పారు.  

రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ దీనిని  న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు.   హేమంత్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్‌ స్వాగతించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.