నట్టింట్లో మాజీ డీజీపీ హత్య...బెంగళూరులో షాకింగ్ ఘటన.. భార్యపైనే అనుమానం?

నట్టింట్లో మాజీ డీజీపీ హత్య...బెంగళూరులో షాకింగ్ ఘటన.. భార్యపైనే అనుమానం?

బెంగళూరులో దారుణం..పట్టపగలే మాజీ డీజీపీ దారుణ హత్య..నట్టింట్లో అత్యంత క్రూరంగా గొంతుకోసి ప్రాణాలు తీశారు. ఈ ఘటనతో  బెంగళూరు నివ్వెరపోయింది. మాజీ డీజీపీ హత్య విషయంలో ఆయన భార్యపై అనుమానం వ్యక్తమవుతోంది. కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాశ్ ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని హెచ్ ఎస్ ఆర్ లే అవుట్ లోని తన నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్యే కత్తి పొడిచి ఓం ప్రకాష్ ను చంపి ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఆదివారం మధ్యాహ్నం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన మూడంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో తీవ్రగాయాలతో ఓం ప్రకాష్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఓం ప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

భార్యపైనే అనుమానం..

దర్యాప్తులో  ప్రకాష్ హత్యకు గురైనట్లు వెల్లడైంది. అయితే హంతకుడు ఎవరో ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఓం ప్రకాశ్ భార్యే ప్రధాన అనుమానితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఓం ప్రకాశ్ భార్య, వారి కుమార్తె ఇద్దరూ గదిలో ఉండటంతో భార్య ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. హత్య గురించి నివేదించడానికి మొదట పోలీసులకు ఫోన్ చేసింది భార్యే. అయితే  పోలీసు బృందం వారి నివాసానికి చేరుకున్నప్పుడు ఆమె తలుపు తెరవడానికి నిరాకరించడంతో మరింత అనుమానాన్ని రేకెత్తించింది. ఓం ప్రకాష్ తన ఆస్తులన్నింటినీ తన కొడుకుకు బదిలీ చేయాలని అనుకున్నాడు. ఆ నిర్ణయం అతని భార్యకు నచ్చలేదని తెలుస్తోంది.

పోలీసు  దర్యాప్తు ..

సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఓం ప్రకాష్ భార్య ,కుమార్తెను పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.

ఓం ప్రకాష్.. కర్ణాటక కేడర్ కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2015లో డైరెక్టర్ జనరల్,ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి ,ఐజిపి)గా పనిచేశారు. 2017లో పదవీ విరమణ చేశారు. బీహార్ లోని చంపారన్ కు చెందిన ఆయన భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.