స్కాలర్షిప్ కోసం ఎంతకు తెగించాడు...తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు

చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని  ప్రతి ఒక్కరికి ఉంటుంది. గోల్ సాధించేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుం టారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటుంటారు..అయితే లక్ష్యా్న్ని చేరే క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు..ఇలాంటి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరకపోగా..అభాసుపాలవుతారు.  సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి  పెన్సిల్వేనియాలో జరిగింది. పెన్సిల్వేనియాలోని చదువుతున్న భారతీయ విద్యార్థి ఒకరు స్కాలర్ షిప్ కోసం..ఏకంగా తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి అడ్డంగా దొరికాడు..వివరాల్లోకి వెళితే.. 
 
పెన్సిల్వేనియాలోని లెహీ యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల భారతీయ విద్యార్థి ఆర్యన్ ఆనంద్ ను  అక్కడి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న ఆర్యన్ స్కాలర్ షిప్ పొందేందుకు తన తండ్రి చనిపోయాడని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడమే కాకుండా.. నకిలీ ఈమెయిల్ అడ్రస్ తో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని ఆనంద్ పై ఆరోపణలతో అరెస్ట్ చేశారు. 

ట్రాన్స్ స్క్రిప్టులు, ఆర్థిక సాయం, టాక్స్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు, తండ్రి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు వంటివి నకిలీవి తయారు చేసి యూనివర్సిటీని మోసం చేశాడని ఆనంద్ పై ఆరోపిస్తున్నారు పోలీసులు. 

అయితే ఇదంతా ఆనంద్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో బయటపడింది. తాను యూనివర్సిటీని, తనను తాను మోసం చేసుకున్నానని ఆనంద్ గిల్టీ ఫీలింగ్ తో రెడ్డిట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. దీంతో ఆనంద్ ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇది లెహీ యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్ మెంట్ జరిపిన విచారణతో కూడా రుజువైంది. ఆనంద్ తండ్రి జీవించి ఉన్నాడని.. ఇండియాలో ఉన్నాడని కూడా విచారణలో తేలింది. 

పరిస్థితులు ఎలాంటివైనా..ఆనంద్ చేసింది నేరమే అంటూ అక్కడి పోలీసులు ఏప్రిల్ 30, 2024న అరెస్ట్ చేశారు. ఫోర్జరీ, రికార్డుల ట్యాంపరింగ్, మోసం కింద పలు సెక్షన్లలో ఆనంద్ పై కేసులు నమోదు చేశారు. 

ఇంకేముంది. నేరం రుజువు కావడంతో ఆనంద్ కు న్యాయ స్థానం 25వేల డాలర్లు అంటే సుమారు రూ. 21 లక్షల జరిమానా విధించింది. శిక్ష అనంతరం ఆనంద్ ను తిరిగి ఇండియా కు వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆనంద్ యూఎస్ ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కస్టడీలో ఉన్నాడు.