మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

వెలుగు, అమరావతి:  వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈవీఎం ధ్వంసం, పోలీస్ అధికారిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుండి విడుదల కానున్నారు.

 కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ బూత్‎లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అడ్డుకోబోయిన పోలీస్ అధికారితో పాటు ఎన్నికల సిబ్బందిపై ఆయన దాడికి దిగారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం, పోలీస్‎ ఆఫీసర్‎పై దౌర్జన్యం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

ALSO READ | వైసీపీలో దువ్వాడ శ్రీను దుమారం.. ఓపిక నశించి జగన్ షాకింగ్ నిర్ణయం

ఈవీఎం ధ్వంసం చేసిన ఇష్యూను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. హైడ్రామా నడుమ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు. దీంతో తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.