డిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే

డిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే

ముంబై: సీఎం పదవి దక్కకపోవడం, కోరినా మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారని.. దీంతోనే ఉన్నఫలంగా షిండే సొంతూరి బాటపట్టారని మహా పాలిటిక్స్‎లో ప్రచారం జరుగుతోంది. మహాయుతి కూటమి నేతల తీరుతో షిండే కలత చెందారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షిండే అసంతృప్తితో ఉండటం వల్లే మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఏక్ నాథ్ షిండే తన సైలెన్స్ బ్రేక్ చేశారు. 

ఆదివారం (డిసెంబర్ 1) తన సొంత గ్రామం సతారాలో షిండే మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా రెండున్నర ఏళ్లుగా ఎటువంటి సెలవు తీసుకోలేదు. విరామం లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కొంత అనారోగ్యానికి గురి అయ్యా.. అందుకే కొన్ని రోజుల విశ్రాంతి కోసం సొంతూరికి వచ్చానని ఊహాగానాలకు తెరదించారు. గొంతు నొప్పి, జ్వరంతో బాధపడ్డానని.. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదటపడిందన్నారు షిండే. ఇక, సీఎం ఎంపిక గురించి షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. సీఎం రేసులో ఫడ్నవీస్ ముందంజ

మహాయుతి కూటమిలో తన మిత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‎తో తనకు మంచి అవగాహన ఉందని.. మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అని.. నేను ఇప్పటికే మహాయుతి కూటమి నాయకత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చానని తెలిపారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేది సోమవారం (డిసెంబర్ 2) బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఖరారు చేస్తామని షిండే క్లారిటీ ఇచ్చారు. 

గత రెండున్నర ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన పని మహారాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుందని.. అందుకే ప్రజలు మాకు చారిత్రత్మకమైన విజయం కట్టబెట్టారన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి ప్రతి పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కూడా లేదని ఎద్దేవా చేశారు. కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2024, డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త సీఎం, కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది.