బీజేపీలో చేరిన మామడ మాజీ ఎంపీపీ దేవ లలిత

నిర్మల్, వెలుగు: బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. మామడ మండలం మాజీ ఎంపీపీ దేవ లలిత చక్రపాణి, నరసాపూర్ మండలానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, నిర్మల్ మండలం ముజిగి, రానాపూర్ తండా, గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీలను ప్రజలు నమ్మడంలేదన్నారు.

తప్పుడు హామీలతో బీఆర్​ఎస్ పార్టీ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో సైతం మోసపూరితమైనదేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను వెలికి తీస్తామన్నారు.

బీజేపీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతోందని.. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన వారే కాకుండా మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని అన్నారు. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ నూతుల భూపతిరెడ్డి, సారంగాపూర్ మండల కన్వీనర్ సామల వీరయ్య, మామడ మండల కన్వీనర్ బాపురెడ్డి, అయిండ్ల భూపాల్ రెడ్డి  పాల్గొన్నారు.