హైదరాబాద్, వెలుగు: దుబ్బాక రిజల్ట్ కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్కు గట్టి షాకే ఇస్తోంది. మాజీ మేయర్, కాంగ్రెస్ లీడర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు ఈ నెల 19న ముహూర్తం కూడా పెట్టుకున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఆమె ఈ నెల 22 లేదా 23న బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఎంపీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం బీజేపీలో చేరారు. మరికొందరు క్యూ కట్టినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని నెలల క్రితం కార్తీక ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించినా మాట ఇవ్వలేదు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె పార్టీలో ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు రెండు రోజుల క్రితం కార్తీకతో భేటీ అయ్యారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఆమెను కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ దూకుడు…
దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్‌లోని కొందరు మంచి నేతలను ఆకర్షించడానికి టీఆర్‌ఎస్ స్కెచ్ వేసినట్లు తెలుసుకున్న బీజేపీ అలర్టయింది. సిటీలోని బలమైన కాంగ్రెస్, బీజేపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని టీఆర్‌ఎస్ కలలు కన్నది. ఈ మేరకు కొందరు డివిజన్ స్థాయి నేతలకు సమాచారం వెళ్లింది. ఫలితం తారుమారు కావడంతో బీజేపీ దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకుంటోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పది డివిజన్లలోని కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఫోకస్ చేసినట్టు చెప్పారు. విజయశాంతి మెదక్‌లోని కొందరు నేతలకు ఫోన్ చేసి తనతోపాటు పార్టీ మారాలని కోరినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ నుంచి మరిన్ని వలసలు
అధికార టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొందరు అసంతృప్త నేతలు కమలం పార్టీతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కొత్తగా టికెట్లు ఆశిస్తున్న వారు…పాత వాళ్లకే మరోసారి చాన్స్ ఇస్తే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాళ్లు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.