- సబితను చేర్చుకొని తప్పు చేశారని వ్యాఖ్య
- కేసీఆర్ తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా
- స్పందించకుంటే తమ దారి తాము చూసుకుంటామని కామెంట్స్
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కారు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి పోటీ చేసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలైన తీగల కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకూ హాజరు కావడం లేదు. సెగ్మెంట్ లోనూ సెలెంట్ గానే వ్యవహరిస్తున్నారు. తీగల కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. తాను టికెట్ అడిగితే ఒకే ఫ్యామిలీ నుంచి రెండు పదవులా..? అని అంటున్నారని తీగల చెబుతున్నారు.
తాను కూడా కేసీఆర్ తో సమానంగా రాజకీయాల్లో ఉన్నానని, ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలను ప్రస్తావిచడం చూస్తుంటే ఆయన కారు దిగడం ఖాయమనే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకొని కేసీఆర్ తప్పు చేశారని తీగల అంటున్నారు. హోం మంత్రిగా ఉండి వందలాది మంది ఉద్యమకారులను జైల్లో పెట్టించిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమంలో పనిచేసిన చాలా మంది పార్టీకి దూరమవుతున్నారని, వారిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెబుతూనే.. కేసీఆర్ స్పందించకుంటే తమ దారి తాము చూసుకుంటామన్నారు.