అంబానీ వాడకం ఇలావుంటది: కోచ్‌ను.. కెప్టెన్‌ చేసిన ముంబై ఇండియన్స్

అంబానీ వాడకం ఇలావుంటది: కోచ్‌ను.. కెప్టెన్‌ చేసిన ముంబై ఇండియన్స్

దేశంలో అత్యంత విజయవంతమైన, ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు అని అడిగితే అందరూ చెప్పే మొదటి పేరు.. ముఖేష్ అంబానీ. కోట్ల విలువైన ఇళ్ల నుండి ఖరీదైన కార్ల వరకు అతని కుటుంబం, వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది. మరి అంతటి విజయాలు అతనికి ఊరికే దక్కాయా! లేదు. పట్టుదలకు తోడు ఊహించని మార్కెటింగ్ స్ట్రాటజీ అవలంభించారు. ఈ విషయంలో అతని సతీమణి 'నీతా అంబానీ' కూడా ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు.

కెప్టెన్‌గా పొలార్డ్

ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో కీరన్ పోలార్డ్.. ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఈ వెస్టిండీస్ వీరుడు.. మరోసారి కెప్టెన్సీ చేపట్టాడు. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్ 2023 (మినీ ఐపీఎల్) టోర్నీలో ముంబై ప్రాంచైజీ అయిన ముంబై న్యూయార్క్‌కు పోలార్డ్.. కెప్టెన్‌గా సేవలందించనున్నాడు. చూశారుగా కోచ్‌ను.. కెప్టెన్‌గా నియమించొచ్చన్న ముంబై యాజమాన్యం తెలివితేటలు.

ముంబై యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజెన్స్.. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక ఆటగాడిని ఎలా వాడుకోవాలో అంబానీని చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా న్యూజిలాండ్ మాజీ దిగ్గజం షేన్ బాండ్ (ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్)ను కూడా జట్టులో కలిపేసుంటే బాగుండేదని కొత్త సలహాలు కూడా ఇస్తున్నారు. 

మేజర్ లీగ్ క్రికెట్ 2023 జూలై 13 నుంచి ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీలో ఎంఐ న్యూయార్క్ పోరు జూలై 16 నుంచి మొదలుకానుంది. ముంబై తన తొలి మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తో తలపడనుంది.

ఎంఐ న్యూయార్క్ స్క్వాడ్

కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, కగిసో రబడా, నికోలస్ పూరన్, డేవిడ్ వీస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, స్టీవెన్ టేలర్, హమ్మద్ ఆజం, హసన్ ఆదిల్, నోస్తుష్ కెంజిగే, మొనాంక్ పటేల్, సర్బ్‌జీత్ జహంగ్ , కైల్ ఫిలిప్, సాయిదీప్ గణేష్.