మెడిసిన్స్ కొరత సర్కారు వైఫల్యమే

 మెడిసిన్స్ కొరత సర్కారు వైఫల్యమే
  • మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ దవాఖానల్లో మెడిసిన్స్ కొరత అనేది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌‌‌‌ నేత హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌ పాలనలో దిక్కు లేకుండా పోయిందని ఫైర్​ అయ్యారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. నిత్యం వేల మందికి వైద్య సేవలు అందించే ఎంజీఎం, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని హరీశ్‌‌‌‌రావు తెలిపారు.

ఈ దవాఖానలో మెడిసిన్ కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారని, మందులు లేవని సంబంధిత అధికారులు చేతులెత్తేయడంతో చేసేదిలేక రోగులు ప్రైవేటు ఫార్మసీలకు వెళ్తున్నారని ఆరోపించారు. డబ్బులు చెల్లించే స్తోమత లేనివాళ్లు, రోగాలతోనే ఇంటి బాట పడుతున్నారన్నారు. 3 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

ఎంజీఎం మాత్రమే కాదని, మిగితా హాస్పిటళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. నిబంధనల ప్రకారం 3 నెలలకు సరిపడా మెడిసిన్‌‌‌‌ను ప్రభుత్వ దవాఖాన్లలో అందుబాటులో ఉంచాలని, అదేం జరగడం లేదన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులకు లబ్ది చేకూర్చేందుకే మందులు సప్లై ఆపేశారా అని సర్కార్‌‌‌‌‌‌‌‌ను హరీశ్ నిలదీశారు. టీఎంఎస్‌‌‌‌ఐడీసీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఉపాధ్యాయులు లేరన్న కారణంతో రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడాలని కోరారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ హరీశ్ రావు ట్వీట్ కూడా చేశారు.