ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ జీవోలపై హరీశ్ రావు విమర్శ
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల స్థానికతను గుర్తించే విషయంలో ఓ విధానమంటూ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు తలాతోకా లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం తీసుకొచ్చిన జీవో 33, ఎండీఎస్(డెంటల్ పీజీ) సీట్ల భర్తీ కోసం తెచ్చిన జీవో 62 వల్ల రాష్ట్ర విద్యార్థులు నష్టపోతారన్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు తెలంగాణలో చదివితేనే.. తెలంగాణ లోకల్ స్టూడెంట్‌గా గుర్తిస్తామని జీవో 33లో పేర్కొన్నారని, ఈ రూల్ వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చేసిన విద్యార్థులు నష్టపోతారని తెలిపారు.
ఎండీఎస్ సీట్లలో అడ్మిషన్లకు, నాలుగేండ్లు తెలంగాణలో చదవాలన్న నిబంధన ఉందని, దీని వల్ల కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. నీట్‌లో మంచి ర్యాంకులు పొంది, ఇతర రాష్ట్రాల్లో బీడీఎస్ చదివిన విద్యార్థులు నష్టపోతారని వివరించారు. మెడికల్ పీజీ సీట్లకు కూడా ఇదే నిబంధన వర్తింపజేస్తే, ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు, ఎయిమ్స్ వంటి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు కూడా లోకల్ స్టేటస్‌ను కోల్పోతారన్నారు. దీని వల్ల ఆయా స్టూడెంట్లకు పీజీ సీట్లు పొందే అవకాశం పోతుందని చెప్పారు. ఈ సమస్య మెడికల్ సీట్లకే పరిమితం కాదని, ఇంజినీరింగ్, లా తదితర అన్ని రకాల అడ్మిషన్లకు కూడా వస్తుందని, దీంతో దీనిపై ఒక విధానం తీసుకురావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే, తాము ప్రభుత్వానికి సూచనలిస్తామని చెప్పారు.