- డిప్యూటీ సీఎం భట్టికి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డిది ఒక మాట అయితే.. మంత్రివర్గానిది మరో మాట ఉందని విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మూసీని ఏం చేయదలుచుకున్నారో ఇప్పటి వరకు చెప్పలేదని.. రూ.లక్షా 50 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఏం డిసైడ్ కాలేదన్నారు. చెరువుల విషయంలో భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఏమిటో చూద్దాం అన్నారు. కూల్చివేతలతో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం కలిగిందని వెల్లడించారు.