వనపర్తి, వెలుగు : చిన్నారెడ్డి పని అయిపోయిందని, ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేవని విమర్శించిన వారికి తానేంటో చూపిస్తానని మాజీ మంత్రి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున జనం రావడంతో ఉద్రేకంగా మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఎవరి వద్ద పైసా ఆశించలేదని, ఎవరిపై దౌర్జన్యం చేయలేదని అందుకే తనను ఇంకా ఇక్కడి జనం అభిమానిస్తున్నారని చెప్పారు. వనపర్తి రాజకీయాల్లోకి గంజాయి మొక్కలు వచ్చాయని, వాటిని తొలగించేందుకు తనకు ఓటర్లు సహాయపడాలని కోరారు.
ALSO READ : కాంగ్రెస్ లోకి భారీ వలసలు : బాలూనాయక్
సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఆరు నెలల కింద పార్టీలో చేరిన కొందరు తనతో పాటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకొని, సోషల్ మీడియా, గుర్తింపు లేని పత్రికల్లో టికెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ పార్టీ క్యాడర్ ను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. తన పద్ధతి మార్చుకొని పార్టీ కోసం పని చేయాలని అప్పుడే భవిష్యత్తు ఉంటుందన్నారు. రెబల్ గా పోటీకి దిగితే పార్టీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.
మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి సొమ్ముతో ఆస్తులు కొన్నారని, తాను గెలిచాక వాటిని కక్కిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ వాళ్లు ఇచ్చే బీరు, బిర్యానీకి ఆశ పడవద్దని, అదే జరిగితే మళ్లీ బానిస జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నాటకకు చెందిన పార్టీ పరిశీలకులు మంజులాదేవి, రాజశేఖర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, జిల్లెల ఆదిత్యరెడ్డి, సత్యారెడ్డి పాల్గొన్నారు.